Thursday, November 14, 2024

Big Story: హోటల్స్‌ వెలవెల.. సెలవులొచ్చినా సగం ఖాళీనే, వెంటాడుతున్న ఆర్థిక కష్టాలు

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : కోవిడ్‌ తదనంతర పరిస్థితులు హోటల్‌ రంగాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఆర్ధిక సంక్షోభం నుండి కోవిడ్‌ తరువాత కొంతమేరైనా ఊపిరి పీల్చుకోవచ్చన్న హోటల్‌ యాజమాన్యాల ఆశలు అడియాశలుగానే మిగిలిపోతున్నాయి. మంచి గిరాకీ ఉన్న సమయాల్లో కూడా 50 శాతానికి మించి ఆక్యుపెన్సీ లేకపోవడంతో యాజమాన్యాలు డీలా పడుతున్నాయి. వాస్తవంగా దసరా పండుగ మొదలుకుని జనవరి వరకూ వరుసగా పండుగలు ఉంటాయి. ఈనేపథ్యంలో ప్రతి ఏటా దసరా మొదలుకుని హోటల్‌ రూమ్స్‌కు మంచి గిరాకీ ఉంటుంది.

గడచిన రెండుళ్లపాటు కరోనా పరిస్థితులు ఈ రంగాన్ని అతలాకుతలం చేయగా కోవిడ్‌ అనంతర పరిస్థితులైనా కలసివస్తాయనుకుంటే అంతంతమాత్రంగానే ఉండటంతో హోటల్‌ యాజమాన్యాలు నిరాశ చెందుతున్నాయి. అయితే, ప్రైవేటు హోటల్‌ యాజమాన్యాలతోపాటు టూరిజం శాఖకు కూడా ఇదే పరిస్థితులు ఉత్పన్నమవతున్నాయి. కాకపోతే ప్రైవేటు హోటల్స్‌ కంటే 10 శాతం అధికంగా టూరిజం హోటల్స్‌ బుక్‌ అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రైవేటు హోటల్స్‌లో 30 నుండి 40 శాతం మేర ఆక్యుపెన్సీ ఉంటుండగా టూరిజం హోటల్స్‌కు మాత్రం 50 నుండి 60 శాతం వరకూ ఆక్యుపెన్సీ ఉంటోంది.

దసరా నుండి సంక్రాంతి వరకూ..

సహజంగా దసరా పండుగ నుండి సంక్రాంతి పండుగ వరకూ అంటే దాదాపుగా మూడు నెలలపాటు హోటల్‌ రంగానికి మంచి డిమాండ్‌ ఉంటుంది. దసరా, దీపావళి, క్రిస్‌మస్‌, జవనరి 1, సంక్రాంతి వంటి ప్రముఖ పండుగలు ఉన్న నేపథ్యంలో కుటుంబంతో ఎక్కువ మంది విహార యాత్రలకు వస్తుంటారు. మరీ ముఖ్యంగా దసరా, సంక్రాంతి పండుగలకు సెలవలు అధికంగా ఉంటాయి. కొన్ని సంస్థలు క్రిస్‌మస్‌కు కూడా వారం వరకూ సెలవులు ప్రకటిస్తుంటాయి. ఈనేపథ్యంలో పర్యాటకులు అధికంగా వస్తుంటారు. సుదీర్ఘమైన తీర ప్రాంతంతోపాటు అధికంగా పుణ్యక్షేత్రాలు రాష్ట్రంలో ఉండటంతో మన రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా పర్యాటకుల తాకిడి మనకు ఎక్కువగా ఉంటుంది. ఈనేపథ్యంలోనే ముందుగానే బుక్‌ అవ్వాల్సిన రూమ్స్‌ సగానికిపైగా ఖాళీగా ఉండటంతో ఈరంగానికి ఆదాయంపై ప్రభావం చూపుతోంది.

టూరిజం హోటల్స్‌లో 60 శతం వరకూ..

- Advertisement -

ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 48 హోటల్స్‌ ఉన్నాయి. వీటిలో 950 వరకూ రూమ్స్‌ ఉన్నాయి. వీటిలో ఈ పండుగ సీజన్‌లో 60 శాతం వరకూ రూమ్స్‌ బుక్‌ అవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దసరా సెలవుల నేపథ్యంలో కోవిడ్‌కు ముందు ఎక్కువ మంది టూర్స్‌ ప్లాన్‌ చేసుకోవడం పరిపాటి. ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన ప్రజలు ముందుగానే ఈ హోటల్స్‌ను బుక్‌చేసుకుంటారు. టూరిజం స్పాట్‌లను ఎంచుకుని ఆయా రిసార్టుల్లో రూమ్స్‌ ముందుగానే బుక్‌చేసుకుంటారు. దరసా సెలవుల సమయానికి కోవిడ్‌కు ముందు 100 శాతం ఆక్యుపెన్సీ ఉండేది. కోవిడ్‌ తరువాత తొలి ఏడాది అయిన ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ 50 శాతం వరకూ మాత్రమే ఆక్యుపెన్సీ ఉన్నట్లు టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లెక్కలు చెబుతున్నాయి. అదే కోవిడ్‌కు ముందు ఏడాదిలో 60 శాతం వరకూ ఆక్యుపెన్సీ ఉన్నట్లు కూడా లెక్కలు చెబుతున్నాయి. ఏపీ, తెలంగాణతోపాటు ఓడిస్సా నుండి పర్యాటకులు దసరా సెలవుల్లో అధికంగా టూర్స్‌కు వస్తుంటారు. వీరితోపాటు రాయ్‌పూర్‌, కోల్‌కత్తా వంటి వివిధ ప్రాంతాల నుండి కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను దర్శించేందుకు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు వస్తుంటారు. దసరా సెలవులు దాదాపు 10 రోజులపాటు ఉండటంతో కుటుంబంతో ఎక్కువ సమయం ఈ పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ గడిపేందుకు ప్లాన్‌ చేసుకుంటుంటారు.

ప్రైవేటు హోటల్స్‌లో 40 నుండి 50 శాతం వరకూ..

ఇదిలా ఉండగా వరుస పండుగల నేపథ్యంలో ప్రైవేటు హోటల్స్‌లో 40 నుండి 50 శాతం వరకూ మాత్రమే రూమ్స్‌ ఆక్యుపెన్సీ ఉంటోంది. ఇది తమకు వచ్చే ఆదాయంపై పెను ప్రభావం చూపుతుందని యాజమాన్యాలు చెబుతున్నాయి. కోవిడ్‌ రెండేళ్లలో రూపాయి ఆదాయం లేకపోవడం, తదనంతర పరిస్థితుల్లో అయినా కొంత ఉపశమనం దొరుకుతుందని ఆశించినప్పటికీ ఈ ఏడాది కూడా 50 శాతం వరకూ మాత్రమే ఆక్యుపెన్సీ ఉండటంతో వారు నిరాశ చెందుతున్నారు. కోవిడ్‌ తరువాత ఆరోగ్య కారణాలతో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా తమకు వచ్చే కస్టమర్లు రాలేకపోతున్నారని వారు చెబుతున్నారు.

కోవిడ్‌ నష్టాలను పూడ్చుకోలేని పరిస్థితి..

కోవిడ్‌కు ముందు రాష్ట్రంలో దాదాపుగా అన్ని ప్రైవేటు రంగాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆశించిన స్థాయిలో ఆదాయాన్ని పొందుతూ విజయవంతంగా ముందుకు సాగాయి. అయితే, 2020లో కోవిడ్‌ వెంటాడటంతో చిన్న హోటల్స్‌ నుండి ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌ వరకూ కోలుకోలేని విధంగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. గత ఏడాది డిసెంబరు వరకూ దాదాపుగా అదే పరిస్థితి కనిపించింది. కొన్ని హోటల్స్‌లో కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేని దీన స్థితికి చేరాయి. అయితే, ప్రస్తుత ఏడాది కోవిడ్‌ తగ్గుముఖం పట్టడం, సెలవు దినాలు, పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో తమ వ్యాపారాలు తిరిగి జోరందుకుంటాయన్న ఆశతో ఉన్నారు. అయితే, దసరా ఆరంభమై వారం కావస్తున్నా ఆదిశగా ప్రధాన పట్టణాల్లోని ప్రైవేటు, టూరిజం హోటల్స్‌ నిండుతున్న దాఖలాలు కనిపించకపోవడంతో కోవిడ్‌ నష్టాలను ఎలా పూడ్చుకోవాలో తెలియక ఇటు ప్రైవేటు, అటు ప్రభుత్వ హోటల్స్‌ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement