అమ్మాయి పిలిచిందని వెళ్తే అంతే సంగతి
హనీ ట్రాప్‌కు పాల్పడుతున్న గ్యాంగ్
శ్రీకాకుళం జిల్లాలో అయిదుగురి అరెస్టు
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
పక్కా స్కెచ్‌తో నిందితులను పట్టుకున్నారు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన రామారావు అనే వ్యక్తిని హనీ ట్రాప్ చేసి, నగదు దోచేసిన ఘటనలో ఐదుగురిని భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిల పేరుతో వలవేయడం, బెదిరింపులకు పాల్పడడం, దాడి చేయడం హనీ ట్రాప్ కేసుల్లో ఇరికించడం వీరి అసలు లక్ష్యం. కొన్ని రోజుల క్రితమే వైజాగ్‌లో హనీ ట్రాప్ కేసులో పలువురిని అరెస్ట్ చేశారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో హనీ ట్రాప్ కేసులు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. మొదట ఓ మహిళతో ఫోన్ చేయించి.. మాయ మాటలు చెప్పి తమ వైపుకు తిప్పుకుంటారు. ఆ తర్వాత తమను ఓ చోటుకి రమ్మని, వారిపై దాడి చేసి, ఉన్నదంతా కాజేస్తారు. అదే తరహాలో శ్రీకాకుళం జిల్లాలోనూ ఈ మధ్య ఓ కేసు బయటపడింది.
తీయటి మాటలతో వివాహిత వల..
కంచరపాలేనికి చెందిన ఓ వివాహిత, సురేశ్, చక్రధర్, వెంకటేశ్, విజయనగరానికి చెందిన లక్ష్మణ్‌తో పాటు మరో ఇద్దరు కలిసి ఓ ముఠాగా ఏర్పడి హనీ ట్రాప్ చేయడం ఆరంభించారు. అలా పక్కా ప్లాన్ చేసి పాతపట్నానికి చెందిన రామారావును లక్ష్యంగా చేసుకున్నారు. అలా జనవరి 18వ తేదీన ఆ యువతి రామారావుకు ఫోన్ చేసి, ఆకట్టుకునే మాటలతో తనవైపుకు తిప్పుకుంది. తాను జనవరి 19వ తేదీన విశాఖకు వస్తానని, ఆ రోజు ఇద్దరం కలుసుకుందామని చెప్పడంతో.. అప్పటికే ఆమె మాయ మాటలు నమ్మిన మత్తులో ఉన్న రామారావు ఓకే చెప్పేశాడు.
అమ్మాయి పిలిచిందని వెళ్తే..
చెప్పినట్టుగానే ఆ యువతి ఆ రోజు రామారావుకు ఫోన్ చేసింది. అప్పుడే తన కుమార్తెను బోయిపాలెం వద్ద హాస్టల్‌లో దింపేసి వెళ్లిపోతున్న రామారావు.. యువతి చెప్పిన తగరపువలస సమీపంలోని సంగివలస మూడుగుళ్ల అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లాడు. అంతలోనే అక్కడికి వచ్చిన నలుగురు వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేసి దాకమర్రిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాదాపు ₹50వేలు, ఏటీఎం కార్డులు లాక్కున్నారు. ఆ తర్వాత రోజు వారు అతని బ్యాంకు ఖాతా నుంచి ₹7 వేలు కాజేశారు. దీంతో తన నగదు మాయంపై బాధితుడైన రామారావు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు జరిగిన విషయాన్ని మొత్తం తెలియజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అలా ఈ కేసులో పోలీసులు ఎట్టకేలకు అయిదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో నిందిలైన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు సమాచారం. అయితే ఇంతకీ ఆ యువతి ఎవరు, ఇప్పటివరకు ఎంత మందిని మోసం చేసింది అన్న పలు విషయాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.