అంతర్వేది: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. నేటి ఉదయం అంతర్వేది చేరుకున్న ఆమెకు ఆలయ మర్యాదలతో అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు.. అనంతరం ఆమె లక్ష్మీ నరసింహస్వామిని సందర్శించుకుని, ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత ఆమెకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో అనేక మంది ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. అన్ని అంశాలపై పోలీసు శాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే హోం మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దైవ దర్శనం కోసం అంతర్వేది వెళ్లిన అనితకు సఖినేటిపల్లి లంకలో పోలీసులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సమర్ఫించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐ.జి. అశోక్ కుమార్, అంబేద్కర్ జిల్లా ఎస్పీ శ్రీధర్ ఎస్పీ ఖాదర్ బాషా లు హోం మంత్రిని మర్యాదపూర్వకంగా కలసి అనితకు అభినందనలు తెలిపారు..