సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామిని సోమవారం రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖామాత్యులు వంగలపూడి అనిత తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తొలుత ఆలయ ఇవో త్రినాధరావు ఆధ్వర్యంలో అర్చకపరివారం మంత్రిని సాదరంగా స్వాగతించింది.
తదుపరి కప్పస్తంభం ఆలింగనం అనంతరం ఆలయ బేడా మండపం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. సింహాద్రినాధుడు, శ్రీదేవి, భూదేవి , గోదాదేవి అమ్మవార్లను మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు మంత్రి పేరిట ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
ఆలయ ఆస్థాన మండపంలో ఆశీనులు కాగా వేద పండితులు వేద మంత్రోశ్చరణలు వల్లిస్తుండగా మృదుమధుర మంగళవాయిద్యాల నడుమ అర్చక స్వాములు ఆశీర్వాదం పలికారు. అనంతరం ఆలయ ఇవో వి.త్రినాధరావు శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు.