Saturday, December 7, 2024

AP | పోలీస్ శాఖకు వెన్నుముక హోంగార్డులే.. సీపీ రాజ‌శేఖ‌ర్ బాబు

(ఆంధ్రప్రభ,ఎన్టీఆర్ బ్యూరో ) : విధి నిర్వహణలో అంకితభావం, నిజాయితీ, చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తున్న హోంగార్డులంద‌రికీ మార్గదర్శకంగా నిలుస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. పోలీసు శాఖకు వెన్నెముకగా నిలుస్తున్న హోంగార్డులు, పోలీసులతో సమాంతరంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. హోంగార్డుల 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విజయవాడలోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో శుక్రవారం నిర్వహించిన వేడుకలకు ముఖ్యఅతిథిగా కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు హాజరయ్యారు. లయబద్ధంగా చక్కటి పరేడ్ నిర్వహించిన హోంగార్డులు ఇతర అధికారులు గౌరవ వందనాన్ని సమర్పించారు.

ఈసందర్భంగా సీపీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ… హోంగార్డులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపి, వారు అందిస్తున్న ఉత్తమ సేవలను ప్రశంసించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం సమాజంలో కొంతమంది పోలీసులకు సహాయంగా ఉండేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 998మంది హోంగార్డులు ఉన్నారని చెప్పిన ఆయన, వీరంతా శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, క్రైమ్ నియంత్రణ, సీఐడీ, టాస్క్ ఫోర్స్, పోలీస్ అంతర్గత భద్రత, పోలీస్ వాహనాల డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, కేంద్ర ప్రభుత్వ సంస్థల భద్రత, అనేక టెక్నికల్ క్యాటగిరిలో పనిచేస్తున్నట్లు తెలిపారు. మరి ముఖ్యంగా హోంగార్డులు అగ్ని ప్రమాదాలు, వరదలు, కోవిడ్ వంటి అత్యవసర విపత్కర పరిస్థితిలో బాధ్యతగా విధులు నిర్వహించడం, మత సామ‌ర‌స్యాన్ని కాపాడడం, ఆర్థిక, సామాజిక, సంక్షేమ కార్యక్రమాల్లో పంచుకోవడం జరిగిందన్నారు.

రాజధానికి కేంద్ర బిందువుగా ఉన్న విజయవాడలో వీఐపీలు, వీవీఐపీలు బందోబస్తు, దసరా, మేరీ మాత, భవాని దీక్షల వంటి ఉత్సవాల్లో సమర్థవంతంగా బందోబస్తు నిర్వహిస్తున్నారని చెప్పారు. హోంగార్డులు, లాండ్ ఆర్డర్, ట్రాఫిక్, కమాండ్ కంట్రోల్, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, పోలీస్ బ్యాండ్, పోలీస్ హాస్పిటల్ వంటి వివిధ విభాగాల్లో పోలీసులతో సమానంగా సేవలు అందిస్తున్నట్లు ప్రశంసించారు. అనంతరం ఈ ఏడాది పదవీ విరమణ చేస్తున్న హోంగార్డులకు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు కమాండెంట్ టి.ఆనంద్, డీఎస్పీ కేవీఎస్ఎన్ పరమేశ్వరరావు, హోంగార్డ్ ఆర్ఐ సుధాకర్ రెడ్డి, డీసీపీలు గౌతమి శాలిని, ఏబీటీఎస్ ఉషారాణి, కృష్ణమూర్తి నాయుడు, ఎస్ వి డి ప్రసాద్ తో పాటు హోంగార్డులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement