హైదరాబాద్‌లో మ్యూజిక్ కాన్సర్ట్‌లు
పబ్‌లు, రెస్టారెంట్లు, ఫామ్ హౌస్‌లలో పార్టీలు
విజయవాడలో మారుమోగనున్న డీజేలు
జనాలను ఆకట్టుకునేందుకు స్పెషల్ ఏర్పాట్లు
కొత్త సంవత్సర వేడుకలకు అంతా సిద్ధం
హోటళ్లు, రిసార్ట్‌లు, క్లబ్‌లు ముస్తాబు
సరికొత్త ఆఫర్లతో స్వాగతం పలుకుతున్న నిర్వాహకులు
ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నోవాటెల్, శంకర్‌పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్స్, పర్వేద పరిధిలోని ఫాంఎక్సోటికా రిసార్ట్స్, గ్రీన్‌వాలీ, మొయినాబాద్ మండలం కనకమామిడిలోని బ్రౌన్‌టౌన్, పోలోరైడింగ్ క్లబ్, చిలుకూరులోని మృగవని ఏకో రిసార్ట్స్‌లో, ముర్తూజగూడలోని ఈవెన్ రిసార్ట్స్ న్యూ ఇయర్ జోష్‌కు ముస్తాబయ్యాయి. ఇవే కాకుండా వ్యక్తిగత ఫామ్‌హౌస్‌లలో వేడుకలను నిర్వహించుకునేందుకు చాలామంది ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా న్యూఇయర్ సందడి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో పొలాల వద్ద వేడుకలు చేసుకునేందుకు యువకులు సిద్ధమయ్యారు. కొత్త సంవత్సర వేడుకలను పుసర్కరించుకుని బేకరీలు, స్వీట్ హౌస్‌లు స్పెషల్ ఐటమ్స్ సిద్ధం చేశాయి. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో మునిగిపోయారు. గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఈ సారి కొత్త సంవత్సరాన్ని శాంతి భద్రతల నడుమ జరపాలని తగిన భద్రతా చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ సిటీలోని ఫ్లై ఓవర్‌లన్నీ బంద్ చేసినట్టు సిటీ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
₹లక్షకుపైగా టిక్కెట్ ధరలు..
నూతనసంవత్సర వేడుకలకు సంపన్న వర్గాలు భారీ ఖర్చులకు వెనుకాడడం లేదు. వీరిని దృష్టిలో పెట్టుకుని కొన్ని హోటళ్లు, రిసార్ట్‌ల యాజమాన్యాలు ఆర్భాటంగా న్యూఈయర్ వేడుకలు నిర్వహిస్తున్నాయి. స్టార్ హోటళ్లు, రిసార్ట్‌ల్లో భారీ ఏర్పాట్లు చేశాయి. ఇక్కడ టిక్కెట్ ధరలు కూడా అదేస్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. మాదాపూర్ రెడ్ రిహినోలో డీజే అభిలాష్ కార్యక్రమానికి ఏకంగా ₹5499 నుంచి గరిష్టంగా టిక్కెట్ ధర ₹1,50,000లుగా నిర్ణయించారు. గచ్చిబౌలిలో హార్ట్ కప్ కాఫీ ‘ఎరా2’ పేరుతో నిర్వహిస్తున్న మ్యూజిక్ పార్టీకి టిక్కెట్ ధర ₹2499 నుంచి ₹1,00,000 నిర్ణయించారు.. ప్రఖ్యాత సింగర్స్ జెమ్మర్, డీజే కార్నివోర్ పాల్గొంటున్నారు. దుర్గం చెరువ వద్ద బీచ్ థీమ్ పార్టీకి గరిష్టంగా ₹ 45వేల టిక్కెట్ ధర ఉంది. శామీర్‌పేటలోని లియోనియో రిసార్ట్ న్యూ ఇయర్ వేడుకలకు ముస్తాబైంది. ఇక్కడ రూమ్‌ల ధరలు ధర గరిష్టంగా ₹ 34999గా నిర్ణయించారు. అలాగే ప్రగతి రిసార్ట్‌లో కూడా న్యూ ఇయర్ ప్యాకేజీలు పెట్టారు. ఇక్కడ కూడా రూమ్‌లకు గరిష్టంగా ₹ 25వేల వరకు ప్యాకేజీ ఉన్నట్టు సమాచారం.
డించిక్ డించిక్.. బెజవాడ రెడీ..
నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు విజయవాడ నగర ప్రజలు సిద్ధమయ్యారు. డిసెంబర్ 31 వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేశారు. చాలామంది నూతన సంవత్సర వేడుకల జోష్‌లో ఉన్నారు. ప్రముఖ స్టార్ సింగర్స్, ప్రఖ్యాత టీవీ యాంకర్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక డీజేలు, సంగీత కచేరీలు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఉన్నప్పుడు హోటల్స్‌లో నూతన సంవత్సర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంగళ, బుధవారం మద్యం మద్యం విక్రయాలు భారీగా ఉండొచ్చునని వ్యాపారులు భావిస్తున్నారు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది.
టైమ్ పెంచిన ఎక్సైజ్..
నూతన సంవత్సర సందర్భంగా మద్యం అమ్మకాల సమయాన్ని ఎక్సైజ్ శాఖ పొడిగించింది. మంగళ, బుధవారం రాత్రి ఒంటిగంట దాకా టైమ్ ఉంటుందని అధికారులు తెలిపారు. బెల్టు షాపుల ద్వారా అమ్మకాలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే రాత్రి ఒంటిగంట వరకు లిక్కర్ అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. న్యూ ఇయర్ పేరుతో అదనపు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.. కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక మొబైల్ పార్టీలు పెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం రాకుండా ఎక్సైజ్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది.
కట్టుదిట్టమైన భద్రతా చర్యలు..
ఆంధ్రప్రదేశ్‌లో నూతన సంవత్సరం వేడుకలపై పోలీసులు కఠినమైన ఆంక్షలను విధించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. పబ్బులు, క్లబ్బులు, ఇతర ప్రదేశాల్లో ఆమోదిత సమయానికి మించి కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆదేశించారు.
రేసింగ్‌లకు చెక్..
నూతన సంవత్సర వేడుకల సమయంలో అశ్లీల నృత్యాలు, డీజేల విన్యాసాలు నిర్వహించడంపై పోలీసులు గట్టి నిఘా ఉంచారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినోద కార్యక్రమాల పేరుతో అసభ్య ప్రదర్శనలకు తావు ఇవ్వొద్దని సూచించారు. అలాగే.. బైక్, కార్ రేసులు నిర్వహించడంపై నిషేధం విధించారు. రోడ్లపై రద్దీని పెంచి, ప్రమాదాలకు కారణం అయ్యే రేసింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. రోడ్డు భద్రతను కాపాడేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా గస్తీ పెంచారు.