Thursday, January 30, 2025

Hitech Eye – క్రిమిన‌ల్స్‌కు వ‌ణుకుపుట్టాలి!… త‌ప్పు చేయ‌డానికి ముందే త‌డిసిపోవాలి

ఇక‌.. ఏ మూల న‌క్కినా ఇట్టే ప‌ట్టేస్తారు
ల‌క్ష సీసీ కెమెరాల ఏర్పాటుకు యోచ‌న‌
ఏపీ పోలీసు అధికారుల స‌రికొత్త నిర్ణ‌యం
నేరాల నియంత్ర‌ణ‌లో టెక్నాల‌జీ వినియోగం
సీసీ కెమెరాల ఏర్పాటుతో ఈజీగా ద‌ర్యాప్తు
డ్రోన్ల‌ను కూడా వినియోగించాల‌ని ప్లాన్‌

ఆంధ్రప్రభ, సెంట్ర‌ల్ డెస్క్‌: నేరం చేసి, చాలామంది ఈజీగా తప్పించుకుంటున్నారు. ఆ తర్వాత కేసు నమోదై, దర్యాప్తు జరిగి పోలీసులు వారిని పట్టుకుంటున్నా.. సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో భయం లేకుండా నేరగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ఈ పరిస్థితులకు చెక్ పెట్టడానికి ఏపీ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఏ మూల నేరం జరిగినా ఆ దృశ్యాలు, నేరగాళ్ల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యేలా చేయడానికి ప్రయత్నాలు చేపట్టింది.

లక్ష సీసీ కెమెరాలు..
ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి పోలీస్ శాఖ సన్నద్ధం అవుతోంది. ముఖ్యంగా ప్రార్థ‌నా మందిరాలు, సెన్సిటివ్ ఏరియాలు, క్రైమ్ హాట్ స్పాట్లు, మెయిన్ సెంట‌ర్ల‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. వీటిల్లో కొన్నింటిని ప్రభుత్వం ద్వారా.. మరికొన్నింటిని దాతల ద్వారా సేకరించి ఏర్పాటు చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

- Advertisement -

డ్రోన్ల వినియోగం..

తాజాగా ఏర్పాటు చేయబోయే సీసీ కెమెరాలను పోలీసు స్టేషన్లకు, కమాండ్ కంట్రోల్ సెంట‌ర్ల‌కు అనుసంధానించనున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేని చోట్లలో డ్రోన్ల ద్వారా నిఘా పెట్టనున్నారు. దీనికోసం ప్రతి పోలీస్ స్టేషన్‌కు కనీసం ఒక్క డ్రోన్ అయినా అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే డ్రోన్లను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ నిర్వహణ, నేర నియంత్రణలో వీటి వినియోగం క‌నిపిస్తోంది. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని పోలీస్ శాఖ నిర్ణ‌యించింది.

సీసీ కెమెరాల ఆధారంగా..

ఇటీవల కృష్ణా జిల్లా కంకిపాడులో వరుసగా బైక్ దొంగతనాలు జరిగాయి. అయితే.. సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతని నుంచి ₹20 లక్షల విలువైన 38వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అటు తిరుపతి జిల్లాలో బాలికపై రేప్​ అండ్​ మర్డర్​ ఘటనలోనూ.. సీసీ కెమెరాల ఆధారంగానే నిందితుడిని గుర్తించారు. మరోవైపు కర్నూలు జిల్లాలో ఓ హత్య కేసును కూడా సీసీ కెమెరాల సాయంతోనే పోలీసులు ఛేదించారు.

తప్పు చేయాలంటే వణకుపుట్టాలి..

ఇలా ఎన్నో నేరాలకు పాల్పడిన వారిని నిఘా నేత్రాలు పట్టించాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొద్ది కెమెరాలతోనే పోలీసులు ఈ స్థాయిలో నేరాలు ఛేదించారు. అలాంటిది లక్ష కెమెరాలు ఉంటే.. నేరగాళ్లు తప్పించుకోలేరని, తప్పు చేయాలంటే భయపడతారనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. భవిష్యత్తులో వాటన్నింటిలోనూ నేరగాళ్ల ముఖాలను గుర్తించే వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా నేరగాళ్లు ఎక్కడ ఉన్నారు.. ఏం చేస్తున్నారనేది పోలీసులకు ఎప్పటికప్పుడు తెలిసే అవకాశం ఏర్పడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement