తిరుపతి : జిల్లాలో స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, అత్యంత ఖచ్చితత్వంతో సమగ్రంగా ప్రణాళికలను రూపొందించి ముందుకు తీసుకువెళ్తామని తిరుపతి జిల్లా కొత్త ఎస్ పి
కృష్ణ కాంత్ పటేల్ అన్నారు. 20 రోజులక్రితం నియమితులై రెండురోజులక్రితం అనూహ్యంగా బదిలీ అయిన ఎస్ పి మల్లికా గార్గ్ స్థానంలో నియమితులైన ఆయన ఈరోజు ఉదయం జిల్లా ఎస్ పి గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కృష్ణ కాంత్ పటేల్ ఐపీఎస్ మాట్లాడుతూ… త్వరలో జరిగే ఎన్నికల సన్నాహక చర్యల్లో భాగంగా అంతర్ రాష్ట్ర, జిల్లా చెక్ పోస్టుల వద్ద తగిన పోలీసు సిబ్బందిని, కేంద్ర సాయుధ బలగాలను నియమించి సమర్థవంతంగా తనిఖీలు చేపడతామన్నారు. ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా అడ్డుకట్ట వేస్తామన్నారు. తిరుపతి అంటే ప్రముఖ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, శాంతి భద్రతలను కాపాడుకుంటూ, అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు.
ముఖ్యంగా జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం, శ్రీ సిటీ పారిశ్రామిక వాడ, వంటి కీలక ప్రాంతాల్లో తగిన గట్టి భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా తిరుపతి జిల్లా తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా సరిహద్దును కలిగి ఉంది, కర్ణాటకకు దగ్గరగా ఉంది. కావున ఇరుగు పొరుగు జిల్లాల పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సరిహద్దుల ద్వారా ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా తనిఖీలను ముమ్మరం చేస్తామన్నారు. రానున్న ఎన్నికల సమయంలో మీడియా వారి సహాయ సహకారం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన మూల స్తంభమైన మీడియా వారు నిత్యం ప్రజాస్వామ్య పరిరక్షణకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ దేవరాజ్ మనీష్ పాటిల్, అదనపు ఎస్పీలు వెంకట్రావు పరిపాలన, కులశేఖర్ శాంతి భద్రత, విమల కుమారి నేర విభాగం, సెబ్ రాజేంద్ర, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు పాల్గొని పుష్పగుచ్చాలతో నూతన ఎస్ పి పటేల్ కు ఘనంగా స్వాగతం పలికారు.