Saturday, October 19, 2024

AP | పెను ప్రమాదంలో హిందూ దేవాలయాల వ్యవస్థ…

(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : తిరుమల లడ్డు ప్రసాదం పవిత్రత, మరి కొన్ని ప్రాంతాలలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు వంటి ఘటనలు హిందూ దేవాలయ వ్యవస్థను పెను ప్రమాదంలో నెట్టేలా కనిపిస్తున్నాయని విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సురేంద్ర వెన్ ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల జోక్యాన్ని నివారిస్తూ విడుదల చేసిన జీవోను స్వాగతిస్తున్నామన్న ఆయన, హిందూ సమాజమే స్వతంత్రంగా దేవాలయాలు నిర్వహించేలా వెసులుబాటు కల్పించాలన్నారు. విజయవాడలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీవోతో హిందూ దేవాలయాలు మరింత పవిత్రతతో శ్రద్ధతో నిర్వహించేలా దాహదపడుతుందన్నారు. తిరుపతి లడ్డు అంశం ప్రపంచవ్యాప్తంగా హిందువులను దిగ్భ్రాంతికి ఆందోళనకు ఆక్రోసానికి గురిచేసిందన్నారు. ఇటువంటి సంఘటనలతో భక్తుల విశ్వాసాలు మనోభావాలే కాకుండా సంపూర్ణ దేవాలయ వ్యవస్థ నేడు ప్రమాదంలో పడిందనే హెచ్చరికలు కలిగిస్తున్నాయన్నారు.

హిందువుల విశ్వాసాలతో ఆటలాడుకునే ధోరణి అనేక దేవాలయ నిర్వహణలో కనపడుతుందని, వీటిలో అనేక ప్రముఖ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండడమే కారణమన్నారు. హిందూ సమాజం స్వతంత్రంగా దేవాలయాల నిర్వహించుకున్న నాడు హిందువుల ధార్మిక విశ్వాసాలకు గౌరవ మర్యాదలు దక్కుతాయన్నారు.

దేవాలయాలకు భక్తి ప్రవర్తలతో సమర్పించే ముడుపులు కానుకలు దేవాలయ అధికారులు పాలక మండల ద్వారా దుర్వినియోగం చేయబడ్డన్న వార్తలు విని వస్తున్నాయని, టీటీడీ సహితంగా ప్రభుత్వ నియంత్రణ దేవాలయాలు నిర్వహణలో హైందవేతరులను నియమించి హిందూ విశ్వాసాలతో ఆటలాడుకుంటున్న వైనం కనబడుతుందన్నారు.

- Advertisement -

ప్రభుత్వాల ద్వారా హిందూ దేవాలయాల నిర్వహణ రాజ్యాంగ విరుద్ధమే కాకుండా హిందూ విశ్వాసాలపై తీవ్రమైన దాడి జరుగుతుందన్నారు. న్యాయస్థానాలు అనేకసార్లు దేవాలయ నిర్వహణలోనూ దేవాలయ ఆస్తుల విషయంలోనూ ప్రభుత్వాలు దూరంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయని, ప్రభుత్వాల ద్వారా హిందూ దేవాలయాలపై నియంత్రణ రాజ్యాంగంలోని 12 25 26 ఆర్టికల్ ఉల్లంగన అవుతుందన్నారు.

హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుతూ దేశవ్యాప్తంగా ఒక మహా ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకోసం ఈనెల 30వ తేదీన అన్ని రాష్ట్రాల గవర్నర్లకు హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగిస్తూ చట్ట సవరణ చేయాలని కోరుతూ మెమరాండంలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ జాతీయ ఉద్యమంలో భాగంగా హిందువుల మనోభావాలను సమస్యలను అర్థం చేసుకున్న ప్రభుత్వాలు స్పందించాలన్న ఆశయంతో హిందూ సమాజం తన ఆకాంక్షలను వ్యక్తపరిచేందుకు విజయవాడలో వచ్చే ఏడాది జనవరి ఐదో తేదీన భారీ బహిరంగ సభను హైందవ శంకరం పేరుతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement