Thursday, November 21, 2024

Big story : వామ్మో.. మద్యం ధరలు!.. మామూళ్ల మత్తులో జోగుతున్న ఎక్సైజు

అమరావతి, ఆంధ్రప్రభ: ‘కొత్త బార్‌ లైసెన్స్‌ కోసం రూ.లక్షలు పెట్టాం. ప్రభుత్వం నిర్థేశించిన ధరలకు మద్యం అమ్మితే మిగిలేది లేకపోగా నష్టాలు తప్పవు. ప్రభుత్వ రేట్లతో సంబంధం లేదు. ఇక్కడ మేం నిర్ణయించిన రేట్లనే వసూలు చేస్తాం’ అంటూ పలువురు బార్ల యజమానులు మద్యం రేట్లు పెంచి వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నారు. ఒకే బ్రాండ్‌కు ఒక్కొక్క బారులో ఒక్కొక్క రేటు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల ప్రాంతాల వారీగా రేట్లు నిర్ణయించి మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. అసలే మద్యం రేట్లు ఎక్కువంటూ వినియోగదారులు గగ్గోలు పెడుతుంటే..బార్లలో రేట్లకు తాగిన మత్తు దిగుతోంది. మద్యం రేట్లను నియంత్రించాల్సిన ఎక్సైజు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో.. బార్ల నిర్వహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి కొత్త బారు పాలసీ అమలులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు ఆన్‌లైన్‌ విధానంలో మూడేళ్లకు లైసెన్స్‌లు మంజూరు చేశారు. బార్‌ లైసెన్స్‌ల కోసం కొన్ని చోట్ల వ్యాపారుల మధ్య పెరిగిన పోటీతో ఫీజు భారీగానే పెరిగింది. విశాఖపట్టణం, ఎన్‌టీఆర్‌ జిల్లా వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకే బార్‌ లైసెన్సులు పొందారు. కొత్త బారు లైసెన్స్‌ పాలసీ అమలులో భాగంగా కొద్ది రోజులుగా మద్యం రేట్లను పెంచినట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. బ్రాండ్‌ డిమాండ్‌ను బట్టి ఒక్కొక్క నిబ్‌(180ఎం.ఎల్‌)పై రూ.30 నుంచి రూ.40 వరకు పెంచారు. అదే ఫుల్‌ బాటిల్‌పై రూ.150 నుంచి రూ.200 వరకు పెంచి అమ్మకాలు జరుపుతున్నారు. అదేమంటే లైసెన్స్‌ ఫీజు, ఇతరత్రా ఖర్చులు పెద్ద మొత్తంలో పెట్టాల్సి వచ్చిందంటున్నారు. గతంలో మాదిరి ప్రభుత్వం నిర్థేశించిన రేట్లకు అమ్మితే నష్టాలు తప్ప మిగిలేదీ ఏమీ ఉండదంటూ ముక్తాయింపు ఇస్తున్నారు.

నిబంధనలు బేఖాతర్‌..

బార్లలో మద్యం అమ్మకాలపై ఎక్సైజు చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. మద్యం ఇన్‌వాయిస్‌తో పాటు పన్నుల చెల్లింపులను బట్టి అదనంగా కొంత వరకు రేట్లు పెంచుకోవచ్చు. అందులో కూడా మూడు కేటగిరీలుగా రేట్ల వసూలుకు అవకాశం ఉంది. కనీస సౌకర్యాలు లేని సాధారణ జనతా బారులో ఫుల్‌ బాటిల్‌ మద్యంపై రూ.50 వరకు పెంచుకోవచ్చు. అదే నిబ్‌(180ఎం.ఎల్‌)పై కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.20కి మించి అమ్మరాదని అధికారులు చెపతున్నారు. ప్రీమియం బార్లలో ఫుల్‌ బాటిల్‌ మద్యంపై రూ.100 నుంచి రూ.120 వరకు, నిబ్‌పై రూ.30 వరకు విక్రయించుకోవచ్చు. స్టార్‌ హోటల్స్‌, టూరిజం హోటల్స్‌ స్థాయిని బట్టి అదనపు రేట్ల వసూలుకు అవకాశం ఉంది. రాష్ట్రంలోని జనతా బార్లలో సైతం బ్రాండ్‌తో నిమిత్తం లేకుండా ఒక్కొక్క నిబ్‌పై రూ.40 నుంచి రూ.70 వరకు వసూలు చేస్తున్నారు. ఇక ఫుల్‌ బాటిల్‌పై ఏ స్థాయిలో వసూలు చేస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రీమియం బార్లలో సైతం ధరల దోపిడీ సాగుతోంది. రద్దీని బట్టి రేట్లు పెంచి అమ్మకాలు జరపుతున్నట్లు తెలిసింది.

కలిసొచ్చిన బ్రాండ్లు..

ప్రభుత్వ మద్యం షాపుల్లో కోరిన బ్రాండ్లు దొరకకపోవడం కూడా బార్ల నిర్వహకులకు కలిసొచ్చిందని చెప్పొచ్చు. అన్ని బ్రాండ్లు ప్రభుత్వ మద్యం షాపులకు పంపుతున్నప్పటికీ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేదని చెపుతున్నారు. కొన్ని చోట్ల వచ్చిన బ్రాండెడ్‌ మద్యం బార్లకు పంపుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. కోరిన బ్రాండ్లు దొరకకపోవడంతో మద్యం వినియోగదారులు బార్ల వైపు వెళ్లక తప్పని పరిస్థితి. సాధారణంగా ప్రీమియం బ్రాండ్లకు అలవాటుపడిన వారు ఖచ్చితంగా బార్లకు వెళ్లాల్సిన పరిస్థితి. దీనిని సావకాశంగా చేసుకొని బార్ల నిర్వహకులు సొమ్ము చేసుకుంటున్నారు.

- Advertisement -

సహకరిస్తున్న అధికారులు..

బార్ల నిర్వహకులకు ఎక్సైజు అధికారుల సహకారం పెద్ద ఎత్తున ఉందనడంలో సందేహం లేదు. ప్రభుత్వ మద్యం షాపులకు ఖచ్చితమైన వేళలు అమలు చేస్తున్నారు. ఇదే బార్ల విషయంలో మాత్రం ఎక్సైజు అధికారులు అమలు చేయడం లేదు. చిన్నస్థాయి పట్టణం నుంచి నగరాల వరకు బార్లలో 24 గంటల పాటు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. నిర్థేశిత సమయం మించిన తర్వాత అధికారుల మామూళ్ల పేరిట మరింత రేట్లు పెంచి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. వీటిని పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. గతంలో ఎక్సైజు అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తే ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు కట్టడి చేసేవారు. ఇప్పుడా వ్యవస్థలు లేకపోవడంతో జిల్లాల్లో అధికారులు బార్ల నిర్వహకులకు సహకరించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులకు సైతం నెలవారీ మామూళ్లు అందడంతో పట్టించుకోవడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement