ఆంధ్రప్రభ స్మార్ట్ – మణుగూరు : గుంటూరు నుండి పాట్నా వెళ్లాల్సిన మిర్చి లోడ్ లారీని ఏలూరులో అగంతకులు హైజాక్ చేశారు.. ఆ లారీని మణుగూరు మండలం కమలాపురంకు తీసుకొచ్చారు హైజాకర్స్.. అక్కడే ఉన్న స్థానిక ఇసుక లారీ డ్రైవర్లు అనుమానంతో లారీని తనిఖీ చేయడంతో గుట్టు బయటపడింది.. ఆ డ్రైవర్లు వెంటనే ఆ లారీ యజమానికి సమాచారం ఇచ్చారు.. ఇదే లారీ గుంటూరు నుంచి రెండు రోజుల క్రితం మిర్చి లోడుతో పాట్నాకు బయలుదేరింది. అయితే ఆ లారీ అక్కడ నుంచి వెళ్లిన తర్వాత లారీ డ్రైవర్ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో గుంటూరు పోలీసులకు ఆ లారీ యాజమాని ఫిర్యాదు చేశారు..
తాజాగా ఆ లారీ కమలాపురంలో ఉన్నట్లు స్థానిక డ్రైవర్లు ఫోన్ లో చెప్పడంతో ఆ లారీ యజమాని అక్కడికి బయలుదేరారు.. ఈ నేపథ్యంలోనే లారీ హైజాక్ కు గురైన విషయాన్ని మణగూరు పోలీసులకు సమాచారం అందించారు.. దీంతో అక్కడికి చేరుకున్న సిఐ సతీష్ కుమార్ లారీని హైజాక్ చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.. లారీని మిర్చి లోడ్ తో సహా సీజ్ చేశారు. అలాగే అసలు లారీలో ఉండాల్సిన డ్రైవర్, క్లీనర్ ఏమయ్యారనే విషయంపై అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..