విజయవాడ రూరల్, (ఆంధ్రప్రభ) : తమ పొలాల్లో హైటెన్షన్ విద్యుత్తు టవర్ల నిర్మాణంపై ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి, జక్కంపూడి గ్రామాల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది మంది రైతులు తమ పొలాలకు చేరుకుని టవర్ల నిర్మాణ పనులను అడ్డుకున్నారు. రెవెన్యూ, ట్రాన్స్ కో అధికారులను నిలదీశారు.
తమ అనుమతి లేకుండా హై టెన్షన్ టవర్లను ఎలా ఏర్పాటు చేస్తారని జక్కంపూడి గొల్లపూడి రైతులు అధికారులను నిలదీశారు. ఈ ప్రాంతంలో సుమారు మూడు గంటలు పాటు యుద్ధ వాతావరణం నెలకొంది. ఒక సందర్భంలో ఆ పొలాల్లో టవర్ల నిర్మాణ నిమిత్తం తవ్విన గోతుల్లోకి రైతులు దూకారు. ఆ గోతుల్లో నిరసన వ్యక్తం చేశారు. ఆ గోతుల్లోనే రైతులు భీష్మించటంతో పోలీసులు బలవంతంగా బయటికి తీసుకువచ్చారు.
ఈ సమాచారంతో ఎమ్మార్వో సుగుణ ఘటన స్థలానికి చేరుకున్నారు. రైతులు, విద్యుత్తుశాఖ అధికారులతో మాట్లాడారు. రెండేళ్లుగా తాము ఆందోళన చేస్తున్నా అధికారులు ఎవరూ పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు. రాత్రికి రాత్రి పొలాల్లో గోతులు తవ్వి టవర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని రైతులు ప్రశ్నించారు.
రైతులకు నోటీస్ ఇవ్వకుండా తమ పొలాల్లో పనులు ఎలా చేపడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఈ పొలాలను అమ్మకుండా ఉంచామని ఇవి కూడా ఎందుకు పనికి రాకుండా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ కూడా కలిసామన్నారు. 2022 అప్రూవల్ ను చూపించిన తర్వాతే పనులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.
ప్రస్తుతం నాలుగు టవర్లు ఉన్నాయని. కొత్తగా 12 టవర్లు చేస్తున్నారని గొల్లపూడి మాదిరిగానే ఇక్కడ కూడా టవర్లు ఎత్తు పెంచితే అటు ప్రభుత్వానికి, ఇటు రైతులకు లాభం చేకూరుతుందని విద్యుత్తు శాఖ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని, లేకపోతే తమకు ఆత్మ త్యాగాలు తప్పా వేరే దారి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.