Monday, November 18, 2024

Fpllowup: భగ్గుమన్న కోనసీమ, అమలాపురంలో హైటెన్షన్‌.. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్ల‌కు నిప్పు

అమరావతి, ఆంధ్రప్రభ : కోనసీమకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టడం పట్ల జిల్లాలో పెల్లుబికిన వ్యతిరేకత గత కొద్దిరోజులుగా ఆందోళన బాట పట్టింది. పేరు పెట్టాలని ఓ వైపు.. వద్దంటూ మరోవైపు రెండు వర్గాలు సాగిస్తున్న పోటాపోటీ సమరం ఒక్కసారిగా భగ్గుమంది. దీంతో అమలాపురంలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. నిరసనకారులు చేస్తున్న ఆందోళనలు అదుపు తప్పాయి. వెరసి అమలాపురం రణరంగంగా మారింది. ఇప్పటికే జిల్లాలో పోలీసు ఆంక్షలు కొనసాగుతున్న క్రమంలో వారంరోజుల పాటు 144సెక్షన్‌ విధిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆంక్షలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే మంగళవారం నాటికి తీవ్ర రూపం దాల్చిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసు ఆంక్షలు సైతం కాదని కదం తొక్కిన నిరసన కారులు హింసబాట పట్టారు. జిల్లాల విభజన ప్రశాంతంగా జరిగినా.. కోనసీమ జిల్లా మాత్రం ధర్నాలు, నిరసనలతో రగిలిపోతోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమగా పేరు మార్పు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్వర్వులు జారీ చేయడంతో జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాను కొనసాగించాలని ఆందోళనలు చేస్తున్నారు.

యువత, జేఏసీ నేతలు పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. స్పందన లేకపోవడంతో మంగళవారం అమలాపురంలో కలెక్టరేట్‌ ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. ఇది కాస్త ఉద్రిక్తంగా మారింది. జేఏసీ నేతలు, జిల్లా సాధన సమితి నాయకులు, యువకులు భారీగా చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే 144సెక్షన్‌ అమల్లో ఉన్నందున ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. యువకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు- చేసుకుంది. ఇది తీవ్రతరం కావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణంగా మారింది. యువకులు, పోలీసుల మధ్య తోపులాట తలెత్తగా ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. కొందరు యువకులు ఓ ప్రైవేటు- బస్సుకు నిప్పు పెట్టారు. అలాగే పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎస్పీ సుబ్బారెడ్డి, డీఎస్పీ, గన్‌ మెన్లతో పాటు- పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసు వాహనాలకు కూడా నిప్పుపెట్టారు. ప్రస్తుతం అమలాపురంలో పరిస్థితులు అదుపు తప్పాయి. దీంతో అదనపు బలగాలు చేరుకుని మోహరించాయి. ఈక్రమంలో మంత్రి పి విశ్వరూప్‌ ఇంటికి ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో పోలీసు బలగాలు మంత్రి కుటుంబ సభ్యులను అక్కడి నుంచి తరలించారు. మరోవైపు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇంటిని ఆందోళనకారులు దగ్ధం చేశారు. ఎస్పీ వాహనంపై కూడా రాళ్ళు రువ్వారు. అమలాపురంలోని పరిస్థితులను ఏలూరు రేంజ్‌ డీఐజీ జి పాలరాజు, విశాఖపట్నం పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్‌ కూడా అమలాపురం చేరుకుని పరిస్ధితిని సమీక్షిస్తున్నారు.

అంబేద్కర్‌ పేరును వ్యతిరేకించడం బాధాకరం : హోం మంత్రి వనిత
ప్రజల నుంచి వచ్చిన విఙ్ఞప్తుల మేరకే జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టినప్పటికీ వ్యతిరేకించడం అత్యంత బాధాకరమని హోం మంత్రి తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం ఘటనపై మంత్రి స్పందించారు. కోనసీమ జిల్లాను అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్‌ చేసాయన్నారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా ఈ మధ్యనే పేరు మార్చడం జరిగిందని, డా.బీఆర్‌ అంబేద్కర్‌ మహా మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ఆయన ఎంతో మందికి స్ఫూర్తి దాయకం.. అలాంటి మహానుభావుని పేరును ఒక జిల్లాకు నామకరణం చేయడాన్ని వ్యతిరేకించడం చాలా బాధాకరమన్నారు. కోనసీమ జిల్లా ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్‌ కోనసీమగా పేరు మార్చిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని, గొడవలు చేసే వారి వెనుక ఉండి నడిపించే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.

పోలీసులపై దాడిని ఖండిస్తున్నా..
20 మందికి పైగా పోలీసులపై రాళ్లు రువ్వి గాయపరిచారని, స్కూల్‌ బస్సులను కూడా తగులబెట్టార ని మంత్రి ఖండించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కొన్ని శక్తులు కుట్ర పూరితంగా ప్రయత్నిస్తున్నాయని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై తప్పక చర్యలు ఉంటాయన్నారు. ఆందోళనకారులను, వారి వెనుక ఉండి నడిపించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను అదేశిస్తున్నట్లు చెప్పారు.

అంబేద్కర్‌ కోనసీమ పేరును వివాదాస్పదం చెయ్యొద్దు : సిపిఎం
డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పేరును వివాదాస్పదం చేస్తూ హింసాత్మక ఘటనలు జరగడం పట్ల సీపీఎ ం రాష్ట్ర కమిటీ- తీవ్ర విచారం వ్యక ్తం చేసింది. అంబేద్కర్‌ కోనసీమ పేరును వివాదస్పదం చేయవద్దని విఙ్ఞపి ్త చేసింది. జిల్లాల పునర్విభజన సందర్భంగా అనేక జిల్లాలకు స్వాతంత్య్ర సమరయోధులు లేదా ప్రముఖ వ్యక్తుల పేర్లు పెట్టార ని, కానీ కోనసీమ జిల్లాకు తదనంతరం అంబేద్కర్‌ నామకరణం చేశార ని, సకాలంలో అన్ని జిల్లాలతోపాటు- పేరు ప్రకటించి ఉండాల్సిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై కొన్ని స్వార్థపర శక్తులు ప్రజల్లో విద్వేషాలు రగిల్చి వివాదం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ పరిణామాన్ని నివారించేందుకు ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించి ఉండాల్సిందని, కోనసీమ జిల్లా ప్రజలందరిదీ అని అంబేద్కర్‌ ప్రజలందరివాడని, ఇతర జిల్లాలకు పెట్టిన పేర్లు స్వీకరించినట్లు-గానే అంబేద్కర్‌ పేరును కూడా స్వీకరించాలని కోరారు. అమలాపురం, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ప్రజలు, పోలీసు యంత్రాంగం సంయమనం పాటించి శాంతి సామరస్యాలను కాపాడాలని, కుల విద్వేషాలు రగిల్చే వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీలు సుహృద్భావ వాతావరణం నెలకొల్పేందుకు ముందుకు రావాలని, అమలాపురంలో శాంతి సామరస్య వాతావరణాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement