మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వచ్చిన ఎంపీ మిధున్ రెడ్డి
వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పర రాళ్ల దాడి
దాడిలో పోలీసులకు గాయాలు
భారీగా మోహరించిన పోలీసు బలగాలు
పుంగనూరు, జులై18 (ప్రభ న్యూస్) : చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పుంగనూరులో ధ్వంసమైన షటిల్ కోర్ట్ ఇండోర్ స్టేడియంను పరిశీలించడానికి రాజంపేట ఎంపీ వెంకట్ మిథున్ రెడ్డి పుంగనూరుకు రావడంతో గో బ్యాక్ మిథున్ రెడ్డి అంటూ రైతులు, టీడీపీ నేతలు నిరసన తెలిపారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకున్న ఎంపీ మిధున్ రెడ్డి కలిసి నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య రాళ్ల దాడి మొదలైంది.
రాళ్ల దాడిలో టీడీపీ నేతలకు, రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఇక రాళ్ల దాడి నేపథ్యంలో ఎంపి గన్ మ్యాన్ మూడు రౌండ్లు కాల్పలు జరిపారు. కాగా ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికెళ్లి కలిశారు. పోలీసుల రంగప్రవేశంతో దాడి సద్దుమణిగింది. ఈ దాడిలో సుమారు 10 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నష్ట పరిహారం అడగడానికి వచ్చిన రైతులపై వైసీపీ నేతలే మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిలో నుండి రాళ్లు, కర్రలతో విసిరారని ఆరోపిస్తున్నారు.