అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మళ్ళీ ఎండలు దంచికొడుతున్నాయి. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు 42 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఎండ తీవ్రత నేపధ్యంలో ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి, సంబంధిత మండల అధికారులకు సూచనలు జారీచేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు విపత్తుల సంస్థ నుంచి హెచ్చరిక సందేశాలు పంపుతోంది. ప్రజలు వారి మండలంలోని ఎండ తీవ్రత ఇతర సమాచారం కోసం విపత్తుల సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ ఏమర్జన్సీ ఆపరేషన్ సెంటర్లో టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలని సూచించారు. శుక్రవారం 84 మండలాల్లో వడగాల్పులు, శనివారం 130 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు వెల్లడించింది. గురువారం కృష్ణా జిల్లా నందివాడలో, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 44.5, తిరుపతి జిల్లా గూడూరులో 44.4, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 44.4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉష్ణోగ్రతలు ఇలా..
శుక్రవారం అల్లూరి సీతారామ రాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
శనివారం (27వతేదీ) పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ , గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఆదివారం (మే 28వ తేదీ) అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్‌ఆర్, అన్నమయ్య చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 45 డిగ్రీ ల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
అప్రమత్తంగా ఉండండి
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణసంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ సూచించారు. ప్రయాణాల్లో ఉన్నవారు కూడా తలకు టోపి పెట్టుకోవడం, రూమాలు కట్టు-కోవడం, గొడుగు వేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి క్షా (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసుకునే పానీయాలైన లస్సీ, మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరినీరు మొదలైనవి త్రాగాలని సూచించారు. మరోవైపు అక్కడక్కడ ఈదురగాలులతో కురిసే అకాల వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు.