జగనన్నకు చెబుదాంలో వచ్చే వినతుల పరిష్కారంలో క్వాలిటీ చాలా ముఖ్యమని, దీని ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, గడపగడపకూ మన ప్రభుత్వం, ఉపాధిహామీ పనులు, హౌసింగ్, వ్యవసాయం- సాగునీరు విడుదల, జగనన్న భూ హక్కు- భూ రక్ష కార్యక్రమాలపై సీఎం సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అంతేకాకుండా గ్రీవెన్స్‌ను రిజెక్ట్ చేస్తే సంబంధిత ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి.. ఎందుకు రిజెక్షన్‌కు గురైందో చెప్పాలని అధికారులను కోరారు. ఈనెల 23 నుంచి జులై 23 వరకూ జగనన్న సురక్షా కార్యక్రమం జరుగనున్నట్లు సీఎం తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్షా కార్యక్రమం ఉంటుదంని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమస్యలపై జల్లెడ పడతారన్నారు. వీటి కోసం మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారని సీఎం జగన్ అధికారులకు తెలిపారు. సమస్యలు ఉన్న వారిని సచివాలయాల వద్దకు తీసుకువచ్చి.. వారి కావాల్సిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అందిస్తారన్నారు సీఎం జగన్. జగనన్న సురక్షలో వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1న మంజూరు చేస్తారని సీఎం తెలిపారు.