అమరావతి, ఆంధ్రప్రభ: మరోసారి వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ల పేట్లు తెరపైకి వచ్చాయి. పాత వాహనాలకు విధిగా హై సెక్యూరిటీ నంబర్లు ప్లేట్లు(హెచ్‌ఎస్‌ఆర్ పీ) అమర్చేందుకు రవాణాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. విధివిధానాలు ఖరారు చేసిన రవాణాశాఖ హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు అమర్చడంపై జిల్లాల అధికారులకు సమాచారం ఇచ్చారు. తొందరలోనే హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు బిగించడంపై రవాణాశాఖ రంగంలోకి దిగనుంది. రాష్ట్రంలో 2014 జనవరి నుంచి వాహనాలకు హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు అమర్చుతున్నారు. వాహనాలకు ఫ్యాన్సీ నంబరు ప్లేట్ల ఏర్పాటును కట్టడి చేసే చర్యల్లో భాగంగా హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు అమర్చాలంటూ 2011లో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివిధ వర్గాలతో సంప్రదింపులు, వ్యతిరేకతలను పరిగణలోకి తీసుకొని పలుమార్లు హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు అమర్చడాన్ని అప్పట్లో ప్రభుత్వం వాయిదాలు వేసింది. విధిలేని పరిస్థితుల్లో 2014 నుంచి రవాణా, రవాణతర వాహనాలకు హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు అమర్చుతున్నారు.
ఏపీలో 1.5 కోట్ల వాహనాలు..
రాష్ట్రంలో కోటిన్నర వాహనాలు ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. వీటిలో హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు ఉన్న వాహనాలు 84లక్షలు ఉండగా మిగిలిన వాహనాలు పాత విధానంలో ఫ్యాన్సీ నంబరు ప్లేట్లతోనే తిరుగుతున్నారు. 2014 తర్వాత కొనుగోలు చేసిన వాహనాల్లో కూడా పలువురు యజమానులు నిర్థేశిత ప్రమాణంలో హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు వాడటం లేదని రవాణాశాఖ అధికారులు గుర్తించారు. హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు లేకుండా తిరిగే వాటిలో 10లక్షల వరకు ద్విచక్ర వాహనాలు, మరో 40లక్షల వరకు త్రిచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు సహా వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. గతంలో హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లకు నగదు చెల్లించిన వాహన యజమానులు 9.5లక్షల వరకు ఉన్నారు. రవాణాశాఖకు నగదు చెల్లించినప్పటికీ హై సెక్యూరిటీ నంబరు ప్లేటును మాత్రం వీరు వాహనాలకు బిగించుకోలేదు.
రూ.500 కోట్లు అదనపు ఆదాయం..
అదనపు ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు అమర్చడం ద్వారా రూ.500 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ద్విచక్ర వాహనం నంబరు ప్లేటు ఖరీదు రూ.450, త్రిచక్ర, ఆపై వాహనాల నంబరు ప్లేటుకు రూ.650గా అధికారులు నిర్ణయించారు. పాత వాహనాలు సహా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నంబరు ప్లేటు బిగించడం ద్వారా రూ.500 కోట్లు అంచనా వేస్తున్నారు. గతంలో నగదు చెల్లించినప్పటికీ హై సెక్యూరిటీ నంబరు ప్లేటు బిగించని 9.5లక్షల మంది వాహనదారుల పరిస్థితి ఏంటనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. వీరికి అప్పటి చెల్లింపులపైనే కొత్త నంబరు ప్లేటు బిగిస్తారా? లేక మరోసారి నగదు చెల్లించాల్సి ఉంటుందా? అనే దానిపై అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. ఒకవేళ నామమాత్రం జరిమానా రుసుముతో కొత్త నంబరు ప్లేట్లు ఇచ్చే ఆలోచన కూడా అధికారులు చేస్తున్నారు.
జరిమానాలే..
రాష్ట్రంలో హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు లేని వాహనాలకు రవాణాశాఖ జరిమానాలు వడ్డించనుంది. ఫ్యాన్సీ, పాత నంబరు ప్లేట్లతో తిరిగే వాహనాలకు రూ.వెయ్యి వరకు జరిమానా విధించాలంటూ రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ జిల్లాల ఉప కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. పలు జిల్లాల అధికారులు వాహనదారులు విధిగా హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు బిగించడంపై డీలర్ల ద్వారా వాహనదారులకు సమాచారం ఇస్తున్నారు. ఆపై తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.