అమరావతి రాజధాని నిర్మాణం కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ రెడ్డి తన విధ్వంసపూరిత ఆలోచనలు మాని.. కక్షసాధింపు ధోరణి వీడాలన్నారు. వాషింగ్టన్ డీసీలో అమరావతి రాజధాని రైతుల పాదయాత్రకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు పెద్దఎత్తున తరలివచ్చారు. ‘‘న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలుచేయాలి.. అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలి.. అలుపెరగని ఉద్యమం, అమరావతి ఉద్యమం..’’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ.. సీఎం జగన్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. రాజ్యాంగ సవరణ చేయనిదే 3 రాజధానులు సాధ్యం కాదని జగన్ రెడ్డికి తెలుసు. అయినా రాష్ట్ర ప్రజలను వంచిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అమలు చేయకుండా మొండిగా వ్యవహరించడం మంచిదికాదన్నారు. కోర్టు తీర్పును ఖాతరు చేయకుండా, మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా సీఆర్డీయే చట్టాన్ని మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ లీడర్లు పాల్గొని ప్రసంగించారు.