Wednesday, November 20, 2024

పోలీస్ నియ‌మాకాల‌లో హోం గార్డ్ కు ప్ర‌త్యేక కోటా..

అమరావతి, ఆంధ్రప్రభ: పోలీసు నియామకాల్లో హోంగార్డులకు హైకోర్టు ఊరట కల్పించింది. నియామకాల్లో వారిని ప్రత్యేక కేటగిరీగా గుర్తించి ప్రిలిమనరీ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించాలని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు, డీజీపీలను ఆదేశించింది. కానిస్టేబుల్‌ నియామకాల్లో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించకపోవటాన్ని సవాల్‌ చేస్తూ గుంటూరు జిల్లాకు చెం దిన పలువురు హోంగార్డులు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు రం విచారణ జరిపారు. పిటిషనర్ల తరుపు న్యాయవాది జీ శీనాకుమార్‌ వాదనలు వినిపించారు. సాధారణ అభ్యర్థుల మాదిరిగానే పోలీస్‌ శాఖలో సేవలందిస్తున్న హోంగార్డులకు కూడా కటాఫ్‌ మార్కులు నిర్దేశించారని ఇది ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందన్నారు.

ప్రిలిమనరీ పరీక్షల్లో అర్హత సాధించలేదనే కారణంగా దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించటంలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసు నియామకాల్లో హోం గార్డులకు ప్రత్యేకంగా 15 శాతం కోటా ఉంటుందన్నారు. 2016లో జారీచేసిన జీవో 97 ప్రకారం స్టేట్‌ అండ్‌ సబార్డినేట్‌ రూల్స్‌ ప్రత్యేక కేటగిరీలకు వర్తించవన్నారు. పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌లో ఓసీలకు 80, ఓబీసీలకు 70, ఎస్సీ, ఎస్టీలకు 60 కటాఫ్‌ మార్కులుగా నిర్ణయించి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారని వివరించారు. హోంగార్డులకు ప్రిలిమ్స్‌లో కటాఫ్‌ మార్కులు నిర్ణయించటం వల్ల దేహదారుఢ్య పరీక్షలకు చాలా మంది అర్హత కోల్పోయారని తెలిపారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయరాదని ప్రభుత్వ న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఇదిలా ఉండగా పోలీసు కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ రాత పరీక్షలో 8 ప్రశ్నలకు సరైన జవాబులు నిర్ణయించలేదని దీన్ని నిపుణుల కమిటీకి నివేదించాలని కోరుతూ మరో 80 మంది అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ వ్యాజ్యాలు శుక్రవారం విచారణకు రానున్నాయి. కాగా హోంగార్డులకు సంబంధించి వాదనలు విన్న న్యాయస్థానం వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించడంతో పాటు ప్రిలిమ్స్‌లో మెరిట్‌ ఆధారంగా దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా డీజీపీ, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డులను ఆదేశిస్తూ తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement