అమరావతి – వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడంటూ అనిల్ కుమార్‌పై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ బోరుగడ్డ ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం అతడి పిటిషన్‌ను కొట్టివేసింది.
విచారణ సందర్భంగా పిటిషనర్ బోరుగడ్డ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా ? అంటూ న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా, పిటిషనర్ అనిల్‌కు పూర్వ నేర చరిత్ర ఉందని, అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో నమోదైన కేసుల్లో ఇప్పటికే రెండు కేసుల్లో ఛార్జ్ షీట్ సైతం దాఖలైందని హైకోర్టుకు ప్రాసిక్యూషన్ తెలిపారు.
ఈ కేసుల్లో బీఎన్ఎస్ సెక్షన్ 111 వర్తిస్తుందని ఆయన ధర్మాసనానికి వివరించారు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. ఇలాంటి కేసుల్లో నిందితులను క్షమించడానికి వీల్లేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బోరుగడ్డ వేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు.