అమరావతి: ‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రివైజింగ్ కమిటీ అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాకే ధ్రువపత్రం జారీ చేసిందని స్పష్టం చేసింది. సీఎం జగన్, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమాను తీశారని.. గతేడాది డిసెంబర్ 18న సీబీఎఫ్‌సీ జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలంటూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన కోర్టు.. సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా శుక్రవారం విచారణ చేపట్టి చిత్రం విడుదలకు అంగీకారం తెలిపింది. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించామని సెన్సార్ బోర్డు తెలిపింది. సెన్సార్ బోర్డు వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.