Tuesday, November 26, 2024

స‌ల‌హాదారుల చ‌ట్టబ‌ద్ద‌త ఏమిటి?

అమరావతి, ఆంధ్రప్రభ : సలహాదారుల నియామకానికి రాజ్యాంగ బద్దత ఉందా..వారి నియామకాలకు అనుసరిస్తున్న నిబంధనలు, నియమావళి ఏమిటంటూ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నిం చింది. దేవాదాయశాఖ సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్‌, ప్రభుత్వ ఉద్యోగ సంక్షేమ సలహాదారునిగా ఎన్‌.చంద్రశేఖర్‌ రడ్డిని నియమించటంపై వేర్వేరుగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సలహాదారుల నియామకాలకు ఉన్న రాజ్యాంగబద్దతను తేల్చుతామని హైకోర్టు స్పష్టం చేసింది. సలహాదారుల నియమాకం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. 26 మంది మంత్రులుంటే 100కు పైగా సలహాదారులున్నారు. ప్రజా ధనం దుర్వినియోగమవుతుంది..రాజ్యాంగ నిబంధన లకు విరుద్ధంగా ఉన్న నియామకాలను రద్దు చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌. శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ సలహాదారులనూ, కన్సల్టెంట్లను నియమించుకోవటం సంప్రదాయంగా ఎప్పటి నుంచో కొన సాగుతుందన్నారు. గత ప్రభుత్వాలు కూడా సలహాదారుల నియామకాలు చేపట్టాయన్నారు. అధికారుల విధి నిర్వహణ లో వారి జోక్యానికి తావు లేదు..సలహాదారుల నియామకాలపై హైకోర్టు ఏమైనా మార్గదర్శకాలు సూచిస్తే వాటిని అనుసరించ టానికి ప్రభుత్వం సిద్దంగా ఉంటు-ందన్నారు. రాజకీయ దురద్దేశ్యాలతో దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టివేయాలని చంద్రశేఖర్‌ రెడ్డి తరపు న్యాయవాది హేమేంద్రనాధ్‌ రెడ్డి వాదించారు. వాదనల్లో హైకోర్టు జోక్యం చేసుకుంటూ బాధ్యతాయుతమైన పరిపాలన వ్యవస్థలో సలహాదారుల ప్రమేయానికున్న చట్టబద్దత ఏమిటని ప్రశ్నించింది. సలహాదారులకుండే జవాబుదారీతనంపైనా ఘాటు- వ్యాఖ్యలు చేసింది. ప్రజా, పాలనా సంబంధమైన సున్నితమైన విషయాలు ముందుగానే బయటకు తెలిసే ప్రమాదం కూడా లేకపోలేదని వ్యాఖ్యానించింది. సలహాదారుల సంఖ్యకు పరిమితం లేదా..చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సైతం భవిష్యత్‌ లో సలహాదారులు వస్తే సమాంతర ప్రభుత్వం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. అనంతరం కేసును ఈనెల 20కు వాయిదావేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement