కర్నూలు, (ప్రభన్యూస్) : ఇళ్ల నిర్మాణానికి వినియోగించే కంకర 20 టన్నుల లారీ లోడ్ జిల్లాలో గతంలో రూ.10వేలకు లభించేది, ప్రస్తుతం టన్నుపై రూ.200 వరకు ధర పెరగడంతో లారీ లోడ్ రూ.14వేలకు చేరింది. గ్రానైట్, వివిధ రకాలకు అనుగుణంగా చదరపు అడుగు రూ.60 నుండి రూ.130కి లభించేది, ప్రస్తుతం చదరపు అడుగుపై రూ.20వరకు పెరిగింది. జిల్లాలో కొంతకాలంగా నిర్మాణ రంగం నీరసించింది. ప్రభుత్వపరంగా నిర్మాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అపార్టుమెంట్లు, సొంత ఇళ్ల నిర్మాణాల సంఖ్య తక్కువగానే ఉంది. కంకర, మొరుసు, గ్రానైట్ వంటి వ్యాపారాలు సగానికి పైగా తగ్గిపోయాయి. అయితే ప్రభుత్వం రాబడి పెంచుకోవడమే లక్ష్యంగా ఖనిజాలపై భారం మోపింది. సీనరైజ్, ఇతర రుసుములను భారీగా పెంచేసింది. దీంతో లీజుదారులు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. అంతిమ భారం ఇళ్లు నిర్మించుకునే సామాన్య, మధ్యతరగతి వర్గాలపై పడింది. ఇందుకు ప్రభుత్వం నూతనంగా నాలుగు జీఓలను విడుదల చేసింది.
వాటిలో జీఓ నంబర్ 42లో గ్రానైట్ మినహా ఇతర చిన్నతరహా ఖనిజాలకు సీనరైజ్ ఫీజుతో పాటు అంతే మొత్తాన్ని కన్సిరైజేషన్ అదనంగా చెల్లించాలి. గతంలో రహదారి కంకర టన్నుకు రూ.60 సీనరైజ్ ఫీజు ఉండగా, ప్రస్తుతం కన్సరైజేషన్ నగదుతో కలిపి రూ.120 అయింది. గ్రానైట్‌కు సీనరైజ్ ఫీజుతో పాటు అందులో 50 శాతం కన్సరైజేషన్ నగదు చెల్లించాల్సి వస్తుంది. వీటికి అధనంగా జిల్లా ఖనిజ నిధి, మెరిట్ అధనంగా ఉంటుంది. జీఓ నంబర్ 90లో మైనింగ్ ప్లాన్ ప్రకారం తొలి ఏడాది 10 శాతం, రెండవ ఏడాది 20, మూడవ ఏడాది 40, నాల్గవ ఏడాది నుండి 60 శాతం మేర ఖనిజ ఉత్పత్తి చేయాలి. అంత ఉత్పత్తి లేకున్నా ఈ మేరకు సీనరైజ్ చెల్లించాల్సి ఉంటుంది.
జీఓ నంబర్ 65లో కొత్తగా లీజులకు ధరఖాస్తు చేసుకునేవారు వి స్తీర్ణానికి అనుగుణంగా చెల్లించే వార్షిక బెడ్ రెంట్ విలువకు 10 రెట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి. ఇప్పటికేలీజులు ఉన్న వారు 5 రెట్లు చెల్లించాలి. గ్రానైట్‌కు హెక్టార్‌కు వార్షిక డెడ్‌లైట్ రూ.1.30లక్షలు ఉందనుకుంటే కొత్త దరఖాస్తుదారులు రూ.13లక్షలు, ప్రస్తుత లీజుదారులు రూ.6.50 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌గా తప్పనిసరిగా చెల్లించాలి. జీఓ నంబర్ 13 పీసీడీ ఇచ్చే కన్‌స్ట్రక్చర్ ఎస్టిబ్లిష్‌మెంట్(వీఎఫ్‌ఈ) కన్సెంట్ ఫర్ ఆపరేషన్(సీఎస్‌ఓ) అనుమతి లీజులు భారీగా పెరిగాయి. గతంలో టర్నో వర్‌ను బట్టి ఉండగా, ఇప్పుడు విస్తీర్ణం, ఉత్పత్తి ఆధారంగా టన్ను, క్యూబిక్ మీటర్ చొప్పున చెల్లించాలి.
పక్కరాష్ట్రాల్లో తక్కువ..
జిల్లా సరిహద్దు ప్రాంతంలోని కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ఖనిజాలు మనతో పోలిస్తే తక్కువగా లభిస్తున్నాయి. ఈ ప్రభావంతో జిల్లా సరిహద్దు ఉండటంతో మన రాష్ట్రం నుంచి గతంలో ఇతర రాష్ట్రాలకు ఖనిజం సరఫరా అయ్యేది. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల నుండి ఏపికి ఎక్కువగా రవాణా అవుతున్నది. దీంతో నిర్మాణదారులపైన భారం పడుతున్నది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital