Saturday, November 23, 2024

రైల్వే పరిధిలో హై అలర్ట్‌! అగ్నిపథ్‌ అల్లర్ల దృష్ట్యా ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రత పెంపు

అమరావతి, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం ఆర్మీ నియామకాల కోసం ప్రకటించిన ‘అగ్నిపథ్‌’ విధానం దేశవ్యాప్తంగా అలజడి రేపుతోంది. గురువారం ఉత్తరాది రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తం కాగా.. శుక్రవారం తెలంగాణలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. సికింద్రాబాద్‌ జంక్షన్‌ రైల్వే స్టేషన్‌లో భారీ విధ్వంసానికి కారణమైన ఆందోళనకారులు ఏకంగా ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును తగులబెట్టేశారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలోని సిగ్నలింగ్‌ వ్యవస్థ దెబ్బతినడంతో పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు, మరి కొన్నింటిని మళ్లిస్తున్నట్లు ఆ శాఖ ప్రకటించింది. మరోవైపు సికింద్రాబాద్‌లో రేగిన ఆందోళనలు మరిన్ని ప్రాంతాల్లో విధ్వంసానికి కారణం కావొచ్చనే నిఘావర్గాల సంకేతాలతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. రైల్వే జీఎం నేతృత్వంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో అన్ని డివిజన్లలో హై అలర్ట్‌ కావాలని సూచించారు. రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్‌, రాష్ట్ర పోలీస్‌ శాఖ పరిధిలోని జీఆర్పీ నుంచి అదనపు బలగాలను రప్పించారు. అలాగే భద్రతా ఏర్పాట్లను పెంచడంతోపాటు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో విజయవాడ డివిజన్‌తోపాటు గుంటూరు, గుంతకల్లు, వాల్తేరు డివిజన్లలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో స్థానిక పోలీసులతోపాటు ఆర్పీఎఫ్‌ సిబ్బంది పెద్ద ఎత్తున మోహరించారు.
విజయవాడ జంక్షన్‌లో అదనంగా ఆర్పీఎఫ్‌, జీఆర్పీ కలిపి 150 మంది అధికారులు, సిబ్బందిని నియమించి అప్రమత్తమయ్యారు. టికెట్‌ లేకుండా స్టేషన్‌లోకి ఎవరూ ప్రవేశించకుండా ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. అలాగే అన్నిన స్టేషన్లు, ప్రాంగణాలలో నలుగురికి మించి గుమిగూడినట్లు గుర్తిస్తే వెంటనే ఆరా తీస్తున్నారు. రైల్వే స్టేషన్‌కు వచ్చే యువకులను పూర్తి స్థాయిలో తనిఖీ చేసి వాళ్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

హెల్ప్‌లైన్‌ల ఏర్పాటు..

అల్లర్ల నేపథ్యంలో పలు రైళ్ల రద్దు, రూట్‌ మళ్లింపు, ఇతర సమాచారం కోసం సికింద్రాబాద్‌, విజయవాడ జంక్షన్లలో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు రైళ్ల రాకపోకలకు సంబంధించిన ఏదేనీ సమాచారం కోసం హెల్ప్‌ లైన్‌ నెం. 040-27786666 కు, విజయవాడ డివిజన్‌ పరిధిలో సమాచారం కోసం 0866- 2767055, 0866- 2767075 హెల్ప్‌ లైన్లలో సంప్రదించాలని సూచించారు.

పలు రైళ్ల రద్దు, డైవర్షన్‌..

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సిగ్నలింగ్‌ వ్యవస్థ, ట్రాక్‌లు దెబ్బతినడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు- దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ మీదుగా, సికింద్రాబాద్‌ నుంచి ప్రయాణించే దాదాపు 71 రైళ్లను శుక్ర, శనివారాల్లో రద్దు చేసింది. అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే పలు రైళ్లను సికింద్రాబాద్‌ బోర్డర్‌ స్టేష్లనన మౌలాలి, చర్లపల్లి తదితర స్టేషన్లలో నిలిపివేస్తున్నట్లు తెలిపింది. వీటిలో గురువారం బయలుదేరిన, శుక్రవారం బయలుదేరాల్సిన పలు సర్వీసులు ఉన్నాయి. అలాగే సికింద్రాబాద్రే-పల్లె(17645)ను చర్లపల్లి వరకు నడపనున్నారు. శనివారం నడిచే తాంబరం- హైదరాబాద్‌(12759), విశాఖపట్నం- హైదరాబాద్‌(12727), బీదర్‌- హైదరాబాద్‌(17009) కాజీపేట- సికింద్రాబాద్‌(07757), చిత్తపూర్‌- సికింద్రాబాద్‌(07759) సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. మొత్తంగా శుక్ర, శనివారాల్లో నడిచే 71 రైళ్లను రద్దు చేయడంతోపాటు పలు సర్వీసులను మార్గం మళ్లించడం, బోర్డర్‌ స్టేషన్ల వరకు నడుపుతున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement