Tuesday, November 26, 2024

హడలెత్తిస్తున్న అకాల వర్షాలు.. రాష్ట్రంలో ఈదురుగాలులు, పిడుగుల బీభత్సం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. తిరుపతిలో భారీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోనసీమ జిల్లా పోలవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. విజయవాడ, గుంటూరు, బాపట్ల, ఏలూరు ప్రాం తాల్లో వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

పిడుగుపాటుకు ముగ్గురు మృతి..

ఆదివారం పిడుగు పాటు కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు రైతులు మృత్యువాత పడ్డారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన మట్టి వెంకట రామయ్య (53) మోదుగుమూడి గ్రామంలోని తన పొలంలో ఆరబోసిన మొక్కజొన్న పంటను రక్షించుకోవడానికి వెళ్లగా పిడుగుపడి అక్కడికక్కడే మరణించాడు. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం పాతమల్లాయపాలెంకు చెందిన చాట్ల శ్యాంబాబు(48), కొరివి కృపానందం(54) ఇద్దరు కళ్ళాల్లో ఆరబోసిన మిర్చి పంటను వర్షం పాలు కాకుండా పట్టాలుక ప్పేందుకు వెళ్లి పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

- Advertisement -

వాయువ్య మధ్యప్రదేశ్‌ నుండి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇదే పరిస్థితి మరో 48 గంటలు ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలంలో పని చేసే రైతులు, కూలీలు, పశు-గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఉదయం నుంచి వాతావరణం కూల్‌గా ఉండటంతో ప్రజలు సేద తీరారు.

రైతుల్లో ఆందోళన..

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటాయని రైతాంగం వాపోతుంది. వరి, మిర్చి పంటల్ని కాపాడుకొనేందుకు రైతులు హైరానా పడుతున్నారు. ఈదురు గాలుల బలంగా వీస్తుండటంతో మామిడి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఏడాది పంట దిగుబడి అంతంత మాత్రంగానే ఉండటంతో ఉన్న కొద్దిపాటి పంటను అమ్మి సొమ్ము చేసుకుందామనుకుంటున్న తరుణంలో అకాల వర్షాలు పంటను దెబ్బతీస్తాయని ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతాంగాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement