శ్రీశైలం మహా క్షేత్రంకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం ఉదయం దాదాపు 20 వేల మంది భక్తులు శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం కావడంతో భక్తల రద్దీ అధికంగా ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని జ్యోతిర్ముడి ధరించిన శివదీక్షాస్వాములకు మాత్రమే స్వామివార్ల స్పర్శదర్శనం కల్పిస్తున్నారు. నిర్దేశిత సమయాలలో మాత్రమే స్పర్శదర్శనానికి అనుమతి ఇస్తున్నారు. సర్వదర్శనం, విరామ దర్శనం, ఆర్జితసేవా భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 22వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు భక్తులందరికీ కూడా స్వామివారి అలంకార దర్శనం మాత్రమే అవకాశం ఉంటుంది. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత మార్చి 5వ తేది నుంచి యథావిథిగా స్వామివార్ల స్పర్శదర్శనం కల్పించనున్నట్లు ఆలయ ఈవో లవన్న వెల్లడించారు.