కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మిరప, పత్తి, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరుణుడి ప్రతాపం ఆగకపోవడంతో నష్టం ఇంకా పెరిగే అవకాశముంది. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఎండుమిర్చి సాధారణ సాగు 17,956 హెక్టార్లు కాగా, గత ఏడాది 19,112 హెక్టార్లలో సాగుచేశారు. గత ఏడాది క్వింటాల్ రూ.18వేలు ధర రావడంతో ఈ ఏడాది ఎక్కువమంది అన్నదాతలు ప్రత్యేకంగా మొగ్గుచూపారు. తొలిసారి సాగు చేసిన 20శాతం మంది రైతుల పంటలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో అత్యధికంగా 23,504 హెక్టార్లలో పంటలు సాగుచేశారు. కర్నూలు, నంద్యాల, ఆదోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఈ ఏడాది సాగైంది. అన్నదాతలకు గుండెకోత మిగిలింది. కూలీలకు డిమాండ్ ఉండటంతో కోత ఖర్చు పెరిగింది. రూ.250 నుండి రూ.300 కూలీ, ఆటో బాడుగ రూ.50 చెల్లించాల్సి వస్తుంది. దిగుబడి, నాణ్యత అంతంత మాత్రంగానే ఉండటంతో వ్యాపారులు మార్కెట్లో క్వింటా మిర్చి రూ.2, రూ.3వేలు మాత్రమే పలుకుతున్నది.
గోనెగండ్ల, ఎమ్మిగనూరు, కోసిగి, పెద్దకడబూరు, నందికొట్కూరు, మిడుతూరు, ఆత్మకూరు, కోడుమూరు పరిధిలో మిరప పంటలు దెబ్బతిన్నాయి. పూత, కాయ దశలో మబ్బులు కమ్మి వర్షాలు కురవడంతో వేరు తెగుళ్లకు దారితీసింది. కొమ్మలు ఎండటం, కాయ కుళ్లు, మచ్చలు వస్తున్నాయి. కొన్ని పొలాల్లో ఎకరాకు 10 క్వింటాళ్లకు పైగా కాయ రాలిపోతున్నది. కొనే వారు లేక కల్లాల్లోనే ఉత్పత్తులు పెట్టి కర్షకులు కంటతడి పెడుతున్నారు. దీంతో పాటు పత్తి సాగుచేసిన రైతులు కూడా అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు. సిద్ధంగా ఉన్న పత్తి రంగు మారింది. వర్షం కారణంగా దిగుబడులు పూర్తిగా తగ్గనున్నాయని అధికారులు ఇప్పటికే గుర్తించారు. జిల్లాలో వరుణుడి ప్రతాపంతో కోతకు వచ్చిన వరి నీట మునిగి వెన్నుకై మొలకెత్తుతుంది. తెల్లగా విరబూసిన పత్తి పూర్తిగా రంగు మారిపోయింది. రబీలో వేసిన శనగ తేమ ఎక్కువై మొక్క కుల్లిపోతుంది. చేతికి అందిన ఇతర పంటలు నాణ్యత దెబ్బతింటున్నాయి. మొత్తం మీద ఈ మాసంలో మొదటి వారం నుండి నేటివరకు వాయుగుండం కారణంగా అన్నదాతలకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.