తిరుమల : ఎపి లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రెండు రోజులుగా తిరుమల, తిరుపతి లో వానల దెబ్బకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం రాత్రి భారీ వర్షాలు రావడంతో తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి.
తిరుమల ఘాట్ రోడ్లలో బుల్డోజర్లతో కొండచరియలను పక్కకు తొలగించారు. ఈ సందర్బంలో శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది
వర్షాల కారణంగా వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని తిరుమల శ్రీవారి మెట్ల నడక మార్గాన్ని గురువారం వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.
బుధవారం తిరుమలలో విపత్తుల నిర్వహణ ప్రణాళికపై అధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు చర్చించారు.అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ భారీ వర్షాల సమయంలో టీటీడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకోవాలని శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు. కొండచరియలు విరిగిపడకుండా చూసుకోవాలని, ఆ విషయంలో ప్రత్యేక నిఘా ఉంచాలని, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శ్యామలరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
విద్యుత్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, జనరేటర్ల కోసం డీజిల్ స్టాక్ పెట్టుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు అంబులెన్సులు అందుబాటులో పెట్టుకోవాలని, అత్యవసర సమయాలలో శ్రీవారి భక్తులకుసేవలు అందించడానికి వైద్య బృందం అందుబాటులో ఉండాలని వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎస్వీబీసీ టీవీలో, సోషల్ మీడియాలో టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు భారీ వర్షాల గురించి శ్రీవారి భక్తులకు సమాచారం అందివ్వాలని, శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మనందరిపై ఉందని టీటీడీ ఈవో శ్యామలరావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాల కారణంగా అలిపిరి నుండి తిరుమలకు వెళ్లే మార్గాన్ని గురువారం వరకు మూసివేస్తున్నామని భక్తులు ఈవిషయాన్ని గమనించాలని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.