Saturday, November 23, 2024

Heavy Rains: పెన్నా ఉగ్రరూపం.. పలు గ్రామాలకు ప్రయాణాలు బంద్​..

ప్రభ న్యూస్‌ ప్రతినిధి , నెల్లూరు : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. జిల్లా మొత్తం జలమయమైంది. పెన్నానది మునుపెన్నడూ లేని రీతిలో వరద నీటిని నింపుకుని విశ్వరూపం చూపిస్తూ పరీవాహక ప్రాంతాలను ముంచెత్తుతోంది. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలు మరో రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేస్తుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తిరుపతి కపిలతీర్థం విశ్వరూపంతో రహదారులు జలమయమై నెల్లూరు జిల్లాకు రాకపోకలు ఆగిపోయాయి .

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు

భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా వాగులు , వంకలు పొంగి పొర్లుతున్నాయి . చేజర్ల మండలంలో నల్లవాగు , పందల వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి . ఏఎస్‌పేట – ఆత్మకూరు ప్రధాన రహదారిలో ఉన్న తెల్లపాడు వాగు పొంగి పొర్లుతుండడంతో ఆత్మకూరు – ఏఎస్‌పేటకు రాకపోకలు నిలిచిపోయాయి . కొండాపురం మండలంలో మిడత వాగు ఉదృతంగా ఉరకలెత్తుతుండడంతో ఆ వైపు ప్రయాణాలను అక్కడి సీఐ , ఎస్సైలు ఆపివేశారు. అదే విధంగా కలువాయి పిల్లవంక నీటి ప్రవాహం అధికంగా ఉన్న కారణంగా రాకపోకలు నిలిపివేయడం జరిగింది. గూడూరు వద్ద పంబలేరు వాగు వరద ప్రవాహం ఉదృతిని అంచనా వేయలేక ఇద్దరు అయ్యప్ప భక్తులు దిగడంతో కొట్టుకుపోయారు. సమీపంలోని ఓ విద్యార్థి , ఇతరులు అతి కష్టంపై వారిని కాపాడడం జరిగింది. వెంకటగిరి కైవల్యా నది ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిపివేశారు. గొడ్డేరు మునుపెన్నడూ లేని రీతిలో జలకళతో పొంగి పొర్లుతూ ప్రవహిస్తోంది. నాయుడుపేట వద్ద స్వర్ణముఖి నది కాజ్‌వేపై నీరు ప్రవహిస్తుండడంతో భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. దీంతో కలవకూరు , పుల్లూరు, నెలబల్లి , ముమ్మారెడ్డిగుంట, అనకవోలు గ్రామాలకు వాహనాలు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

నీట మునిగిన పంట పొలాలు , నారుమడులు

వర్షాల కారణంగా వెంకటాచలం మండలంలోని కనుపూరు చెరువు పూర్తి స్థాయిలో నిండిపోవడంతో చెరువుకు సంబంధించి కలుజు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నారుమడులు నీట మునిగిపోయాయి . నార్లు కుళ్లిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా పెళ్లకూరు మండలంలో పంట పొలాలు నీట మునిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి . మెట్ట ప్రాంతాల్లో మినుము పంట సాగు చేసిన రైతులకు అకాల నష్టం చేకూరింది. ముత్తుకూరు మండలంలో చెట్లు విరిగిపడడంతో ఆగిన రాకపోకలను స్థానిక అధికారులు పునరుద్ధరించారు. ఇక మర్రిపాడు మండలం తిమ్మాయిపాళెం , నందవరంలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పాత ఇళ్లు కూలిపోవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.

సోమశిలకు రికార్డు స్థాయిలో 1.25 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

జిల్లా ప్రధాన జలాశయం అయిన సోమశిలకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం 1.25 లక్షల క్యూసెక్కుల రికార్డు ఇన్‌ఫ్లో నమోదు కావడంతో జలాశయం నిండుకుండలా తయారైంది. దీంతో పది క్రస్టు గేట్లు ఎత్తివేసిన అధికారులు .. సముద్రంలోకి 80 వేల క్యూసెక్కులకు పైగా నీటిని వృధాగా వదిలివేస్తున్నారు. ఆత్మకూరు ఆర్డీవో చైత్రవర్షిణి జలాశయాన్ని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చచేశారు. సంగం , పెన్నా బ్యారేజీల నిర్మాణం పూర్తయి ఉంటే మరికొన్ని టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశాన్ని జిల్లా ప్రజలు కోల్పోయారు.

ఎగసిపడుతున్న సముద్రం .. పొటెత్తుతున్న అలలు

కాగా , 167 కిలో మీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న నెల్లూరు జిల్లాకు 12 మండలాలు తీర ప్రాంతంలో ఉన్నాయి . బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మామూలు స్థాయి నుంచి అలలు ఎగిసి పడుతుండడం , పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు రావడం జరిగింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికార యంత్రాంగం స్పష్టం చేసిన నేపథ్యంలో తీర ప్రాంత గ్రామాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న తహసీల్దార్లు , ఎంపీడీవోలు, ఇతర అధికారులు మత్స్యకారులకు అవసరమైన ఏర్పాట్లను చేసే పనిలో నిమగ్నమయ్యారు. కృష్ణపట్నం ఓడరేవులో తుపాను ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ , జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తూ అధికారులతో సమీక్షిస్తూ తుపాను సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు కళాశాలలు, పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవును ప్రకటించాయి . ప్రభుత్వ విద్యాసంస్థల్లో కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement