ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉంది. థాయ్‌లాండ్, అండమాన్ నికోబార్ తీరం వద్ద శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఆగ్నేయ బంగాళాఖాతానికి చేరుకుని 15వ తేదీ నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత మరింత బలపడి ఏపీ తీరంలో 17, 18 తేదీల నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపానుగా మారాక దీనికి ‘జవాద్’గా నామకరణం చేయనున్నారు. విశాఖ, కాకినాడ మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శనివారం ఉదయం నుంచి రాష్ట్రంలో పలు చోట్ల చెదురుమదురు వానలు కురిశాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు చోట్ల కుండపోత వానలు కురిశాయి.