ఆంధ్రప్రదేశ్‌లో ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలోని ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచానా వేసింది. కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పొంగి ప్రవహిస్తున్నది. ఫలితంగా కృష్ణా రివర్ బేసిన్‌లోని శ్రీశైలం, ప్రకాశం బారాజ్‌లు నిండుకుండలా మారాయి. నాగార్జునసాగర్‌లోకి భారీ వరదలు రావడంతో 20 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2.93 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే ద్వారా వదులుతున్నారు.
నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌లోని 6 జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికను భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.