అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఇంటీ-రియర్ కర్ణాటక నుంచి తమిళనాడులోని కొమోరిన్ ప్రాంతం వరకు ద్రోణి అంతర్గత తమిళనాడు గుండా సగటు- సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి మరియు పడమటి గాలులు వీస్తున్నాయి. శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
విజయవాడలో మధ్యాహ్నం నుంచి కారుచీకట్లు కమ్మేశాయి. సాయంత్రం సుమారు గంట సేపు భారీ వ ర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైయిన్లు పొంగిపొర్లాయి. మచిలీపట్నం, ఒంగోలు, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. గత నెల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఈనెల మొదట్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసినప్పటికీ రెండో వారం నుంచి ఎండల తీవ్రత పెరిగింది.
గత వారం రోజులుగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంధ్యాల, సత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
నైరుతీ రుతుపవనాలు మరికొద్ది రోజులు కొనసాగనున్న నేపథ్యంలో ఈనెల్లో సాధారణం అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతోందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరో వారం రోజుల్లో సెప్టెంబర్ పూర్తి కానున్న నేపథ్యంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో రైతాంగంలో హర్షం వ్యక్తం అవుతోంది.