Sunday, November 24, 2024

Srikakulam జిల్లాలో భారీ వ‌ర్షం – నాగావళి, వంశధార నదులలో పెరుగుతున్న నీటి మట్టం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, శ్రీకాకుళం బ్యూరో : బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా శనివారం సాయంత్రం నుంచి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆమదాలవలస, గార, శ్రీకాకుళం మండలాల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మిగిలిన మండలాల్లో 2నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

ఆదివారం ఉదయానికి జిల్లా వ్యాప్తంగా సగటున ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా జిల్లా మొత్తంగా 144 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నాగావళి, వంశధార నదులలో నీరు ఇంతవరకు ప్రమాద స్థాయిలో లేనప్పటికీ నెమ్మదిగా వరద నీరు చేరుతుండడంతో వాగులు, కాలువలు నిండుగా ప్రవహిస్తున్నాయి.

- Advertisement -

లావేరు మండలం బుడతవలస గ్రామం వద్ద ఒక వాగులో ముందు ఒక ట్రాక్టర్ వెళుతుండగా ఆ వెనుకనే మరో వాహనం వ్యాను కూడా దిగింది. అయితే వాగులో నీటి ప్రవాహం తీవ్రంగా ఉండడంతో వ్యాన్ క్యాబిన్ లో నీరు చేరుతుండడంతో డ్రైవర్ స్థానికులు రక్షించి బయటికి తీశారు.ట్రాక్టర్ డ్రైవర్ కూడా వాహనం నుంచి జాగ్రత్తగా బయటపడినట్లు స్థానికులు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా పంట పొలాలను వ‌ర‌ద ముంచెత్తింది. శ్రీకాకుళం మన్యం జిల్లాలోని వంగర మండలంలో మడ్డువలస రిజర్వాయర్ కు సువర్ణముఖి వేగవతి నదుల నుంచి భారీగా వరదనీరు వస్తుండడంతో ఆరు గేట్లు ఎత్తారు.

దీంతో పొలాల్లోకి వరద నీరు చేరిన‌ట్లు రైతులు తెలిపారు. సోమ మంగళవారాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేప‌థ్యంలో కలెక్టరేట్‌, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement