Monday, November 18, 2024

Heavy Rains – ఏపీలో వీడని వాన – ఏజెన్సీ జిల్లాల్లో రెడ్ అలెర్ట్

ఏపీలో జడివాన వీడలేదు. ఉత్తరాంధ్రాను వర్షాలు దంచుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముంపు బెడద దాపురించింది. రాష్ర్టంలో భారీ ప్రాజెక్టుల్లో జలకళ పలకరిస్తుంటే.. చిన్న చితక డ్యామ్ లో వరద పోటెత్తుతోంది. వాగులు వంకలు ఉరుకులు పరుగులు పెడుతుంటే.. జనం రాకపోకలు స్థంభించాయి. అనేక జిల్లాల్లో రోడ్డు ధ్వంసమయ్యాయి. విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. లక్షలాది ఎకరాల్లో వరిపొలాలు మునిగిపోయాయి. ఇక రోజువారీ కూలీల పరిస్థితి దయనీయం. గత నాలుగు రోజులుగా పని లేదు. చేతిలో చిల్లి గవ్వలేదు. ముంపు ప్రాంతాల్లో పునరావస కేంద్రాల పుణ్యమాని గుక్కెడు నీళ్లు.. పట్టెడు అన్నం దొరకుతోంది. ఇక అధికారులు, ప్రజాప్రతినిధులు వరద ప్రాంతాల్లో పోటెత్తుతున్నారు. పరామర్శలు, సానుభూతి వచనాలు.. భరోసా హామీలు దంచుతున్నారు.

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, విజ‌య‌వాడ ప్ర‌తినిధి: ఏపీలో ఉత్తరాంధ్ర, కోస్తాజిల్లాల్లో భారీ వర్షాలు… రాయలసీమలో ఓ మోస్తరు వానలు పడుతున్నాయి. కర్ణాటక, మహారాష్ర్టలో భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో నీరు పరవళ్లు తొక్కుతోంది. క్రమేపీ తీవ్రత పెరుగుతుంది. ఈ స్థితిలో గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వరదలు భారీస్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఏపీలో చాలా జిల్లాల్లో వర్ష ప్రభావంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. వందల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా పంట నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

ఏలూరు, తూర్పుగోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్‌ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. అక్కడి చెరువులు, వాగులు పొంగిపొర్లాయి. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చాలా చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లక్షన్నర ఎకరాలో ఖరీఫ్ సాగుకు ఇబ్బంది తప్పలేదు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఉద్యాన పంటలూ దెబ్బతిన్నాయి.వర్షాలు, వరదల వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగిన్నట్లు అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో నీటిలో మునిగి యువకుడు, అల్లూరి జిల్లాలో ఇల్లు కూలి ఓ మహిళ, కృష్ణాలో ఓ వృద్ధురాలు చనిపోయారు. గోదావరి జిల్లాల్లో అలజడి తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని చాలా గ్రామాలపై వరద ప్రభావం భారీగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ జిల్లాల్లోని 25 పశువుల కొట్టాలు నాశనం అయ్యాయి..చాలా చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి.

తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో 3 చోట్ల పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు..దాదాపు 700లకుపైగా జనాన్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఏలూరు జిల్లాలో గండిపోచ్చమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగిపోయింది. ఏజెన్సీ ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచింది. బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, టి.నరసాపురం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వాగులు పొంగాయి, పొలాలు నీట మునిగాయి.అధికారుల లెక్కల ప్రకారం ఏపీలో 600 కిమీటర్ల పైగా రోడ్లు దెబ్బతిన్నాయి. 200లకుపైగా విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. మూడు సబ్‌ స్టేషన్లు దెబ్బతిన్నాయి.

వాగుల పరవళ్లు.. వరద పోటు

ఎర్రకాలువకు వరద పోటెత్తింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండల నత్త రామేశ్వరంలో ఆలయంలోకి నీరు చేరింది. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. గుర్రాల వాగు ఉగ్రరూం దాల్చింది. కట్టలేరుకు వరద పెరగడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.అక్కపాలెం రహదారిలోని వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని పలు గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కంచికచర్ల మండలం చెవిటికల్లులోని లక్ష్మయ్యవాగు పొంగి ఆ గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం మోపర్రులో నారుమడులు నీటమునిగాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. వర్షాల ధాటికి నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కాజ్‌ వే మీదుగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో నందిగామ, వీరులపాడు మండలాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. నల్లవాగు, కూచి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చందర్లపాడు పాటింపాడు మధ్య ఉన్న రహదారిపై గుర్రాల వాగు పొంగి ప్రవహిస్తుండగా వాహనాల రాకపోకలు నిలిపేశారు. ఎవరు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఏలూరులోని తమ్మిలేరు పరివాహక ప్రాంతంలో వరద నీరు ఎక్కువగా చేరుట వలన తమ్మిలేరుచుట్ట ప్రక్కల నివసించే ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టు పటిష్టత దృష్ట్ర్యా క్షేత్ర స్థాయిలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి , ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్తమ్మిలేరు గట్లు స్థితిగతులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. జలాశయాల్లో .. జల కళ

భారీ వర్షాలకు కొన్ని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి.అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని కలాయణపులోవ జలాశయం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని డుడుమా జలాశయంలో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరింది. ముందు జాగ్రత్త చర్య అధికారులు 7వ నంబర్‌ గేటును ఒక అడుగు మేర ఎత్తి సుమారు వెయ్యి క్యూసెక్కులనీటిని దిగువకు వదులుతున్నారు.

పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని ఎత్తిపోతల జలపాతం జలకళను సంతరించుకుంది. ఎగువ కురుస్తున్న వర్షాలకు ప్రవాహం పోటెత్తి 70 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతోంది.కృష్ణా నదిలో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రవాహం విపరీతంగా పెరిగింది. పులిచింతల, ప్రకాశం బ్యారేజీలకు కూడా నీటి ప్రవాహం కొనసాగుతోంది.ధవళేశ్వరం దగ్గర వరద పోటెత్తింది. లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

ఇవాళ కూడా ధవళేశ్వరం దగ్గర భారీ వరద మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రేపటిలోగా మొదటి ప్రమాద హెచ్చరికకు వరద చేరుతుందని అంచనా వేస్తున్నారు ఏజెన్సీ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఏలూరు, అల్లూరి సీతారామరాజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు.

ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పార్వతీపురం మన్యం,నంద్యాల, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించారు. కాకినాడ, కోనసీమ అంబేద్కర్ జిల్లా, గోదావరి జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు.

ముఖ్యంగా పొలం పనులకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీలో యావరేజ్‌గా గంటకు 19 నుంచి 23 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అవసరం అయినేతే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు. ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. రోడ్లు కోతకు గురి కావడంతోపాటు, రహదారులపైకి పెద్దఎత్తున వర్షపు నీరు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement