Saturday, November 16, 2024

AP: కేంద్ర బృందంతో కలెక్ట‌ర్ సృజ‌న భేటీ.. నష్టం వివరాలు అందజేత..

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : రికార్డు స్థాయిలో భారీ వర్షాలు, కృష్ణానదికి పోటెత్తిన వరద, బుడమేరుకు పడిన గండ్లు.. ఈ మూడింటి కారణంగా విజయవాడ, ప‌రిస‌ర ప్రాంతాలు ఆక‌స్మికంగా ముంపున‌కు గుర‌య్యాయ‌ని, ఎన్‌టీఆర్ జిల్లాకు అపార న‌ష్టం వాటిల్లింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న కేంద్ర బృందానికి వివ‌రించారు. జిల్లాలోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో జ‌రిగిన న‌ష్టాన్ని ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించి, న‌ష్ట అంచ‌నాకు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ అనిల్ సుబ్రహ్మ‌ణ్యం నేతృత్వంలో కేంద్ర బృందం గురువారం జిల్లాలో ప‌ర్య‌టించింది. తొలుత క‌లెక్ట‌రేట్‌లో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద కార‌ణంగా ముంపున‌కు గురైన ప్రాంతాలు, బాధితుల‌కు ప్ర‌భుత్వం అందించిన స‌హాయ‌స‌హ‌కారాలు, శాఖ‌ల వారీగా జ‌రిగిన న‌ష్టాల వివ‌రాల‌తో కూడిన ఛాయాచిత్ర ఎగ్జిబిష‌న్‌ను అనిల్ సుబ్రహ్మ‌ణ్యం నేతృత్వంలో కేంద్ర బృంద స‌భ్యులు ప‌రిశీలించారు.ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల జ‌రిగిన న‌ష్టాన్ని వివ‌రించారు.

24 గంటల వ్యవధిలో దాదాపు 26 సెంటీమీటర్ల వర్షపాతం న‌మోదు, ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో 11 లక్షల 43 వేల‌కు పైగా క్యూసెక్కుల నీరు రావ‌డం, బుడ‌మేరు గండ్లతో ఒక్క‌సారిగా 40 వేల క్యూసెక్కుల నీరు అక‌స్మాత్తుగా న‌గ‌రంపైకి రావ‌డంతో 64 కార్పొరేష‌న్ వార్డుల్లో 32 వార్డులు జ‌ల‌మ‌య‌మ‌య్యాయ‌ని.. అర్బ‌న్ ప్రాంతాల‌తో పాటు ఇబ్ర‌హీంప‌ట్నం, జి.కొండూరు మండ‌లాల్లోని కొన్ని ప్రాంతాల‌పైనా వ‌ర‌ద ప్ర‌భావం ప‌డింద‌ని తెలిపారు. సెప్టెంబ‌ర్ 1వ తేదీ మొద‌లు గౌర‌వ ముఖ్య‌మంత్రి మార్గ‌నిర్దేశ‌నంతో పెద్దఎత్తున స‌హాయ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని, ఆహారం, తాగునీరు, పాలు, మందులు, బిస్క‌ట్లు త‌దిత‌రాల‌ను అందించామ‌ని, స‌హాయ‌క కార్య‌క్ర‌మాల్లో హెలికాప్ట‌ర్లు, డ్రోన్లు కూడా కీల‌క పాత్ర‌పోషించాయ‌న్నారు. పున‌రావాస‌, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయ‌డం జ‌రిగిందని, రేష‌న్‌తో పాటు ఎన్ని విధాలా సాయ‌మందించాలో అన్ని విధాలా స‌హాయ‌కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని వివ‌రించారు.

రూ. 730 కోట్ల మేర ఇరిగేష‌న్ ఆస్తుల‌కు న‌ష్టం….
భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల జ‌రిగిన న‌ష్టాన్ని మ‌దించే ప్ర‌క్రియ శ‌ర‌వేగంగా జ‌రుగుతోందని.. అయితే ప్రాథ‌మిక అంచ‌నాల ప్ర‌కారం 49,342 మంది రైతుల‌కు చెందిన మిన‌ప‌, ప‌త్తి, పెస‌ర‌, మొక్క‌జొన్న‌, వ‌రి త‌దిత‌ర పంట‌ల‌కు సంబంధించి 42,328 హెక్టార్ల‌లో పంట న‌ష్టం వాటిల్లింద‌ని, ఎస్‌డీఆర్ఎఫ్ మార్గ‌ద‌ర్శ‌కాలకు అనుగుణంగా రూ. 69.74 కోట్లు ఇన్‌పుట్ స‌బ్సిడీ అవ‌స‌రమ‌ని క‌లెక్ట‌ర్ సృజ‌న వివ‌రించారు. ఇసుక మేట వేయ‌డం, నేల కోత‌కు గుర‌వ‌డం వ‌ల్ల కూడా న‌ష్టం వాటిల్లిన‌ట్లు తెలిపారు. ఉద్యానశాఖ‌కు సంబంధించి 5,227 హెక్టార్ల‌లో మిర‌ప‌, అర‌టి, ప‌సుపు, కూర‌గాయ‌లు, పూలు, బొప్పాయి, మామిడి, న‌ర్స‌రీ, ఆయిల్‌పామ్‌కు రూ. 21.73 కోట్ల మేర న‌ష్టం వాటిల్లిన‌ట్లు వివ‌రించారు.

- Advertisement -

అదే విధంగా ప‌శుసంవ‌ర్థ‌క శాఖ ప‌రిధిలో రూ. 69.41 ల‌క్ష‌ల న‌ష్టం జ‌రిగింద‌న్నారు. కృష్ణాన‌దికి రికార్డు స్థాయిలో వ‌చ్చిన వ‌ర‌ద వ‌ల్ల జ‌రిగిన న‌ష్టాల‌కు సంబంధించి పున‌రుద్ద‌ర‌ణ ప‌నుల‌కు దాదాపు రూ. 635 కోట్లు అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని తెలిపారు. అదే విధంగా బుడ‌మేరు గండ్ల ప‌నుల‌కు రూ. 36.98 కోట్లు, మునియేరు న‌ష్టాల‌ను పూడ్చేందుకు రూ. 53.27 కోట్లు అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. మొత్తంమీద చూస్తే రూ. 730 కోట్ల మేర ఇరిగేష‌న్ ఆస్తుల‌కు న‌ష్టం జ‌రిగిన‌ట్లు వివ‌రించారు.

జిల్లాలో విజ‌య‌వాడ ఆర్ అండ్ బీ స‌ర్కిల్ ప‌రిధిలో 690 కిలోమీట‌ర్ల మేర ర‌హ‌దారులు దెబ్బ‌తిన్నాయ‌ని.. పున‌రుద్ద‌ర‌ణ ప‌నుల‌కు దాదాపు రూ. 189 కోట్లు అవ‌స‌ర‌మ‌ని తెలిపారు. ఈహెచ్‌టీ స‌బ్‌స్టేష‌న్లు, 33/11 కేవీ స‌బ్ స్టేష‌న్లు, 33కేవీ ఫీడ‌ర్లు, స్తంభాలు త‌దిత‌రాల‌కు సంబంధించి రూ. 45.14 కోట్ల మేర న‌ష్టం జ‌రిగింద‌న్నారు. గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా (ఆర్‌డ‌బ్ల్యూఎస్‌) శాఖ ప‌రిధిలో 58 తాగునీటి ప‌థ‌కాల‌కు న‌ష్టం వాటిల్లింద‌ని.. రూ. 114 కోట్ల మేర నిధులు అవ‌స‌ర‌మ‌ని తెలిపారు. పంచాయ‌తీరాజ్, ఐసీడీఎస్ త‌దిత‌ర శాఖ‌ల‌తో పాటు సామాజిక ఆస్తులకూ న‌ష్టం జ‌రిగింద‌ని, పూర్తిస్థాయిలో న‌ష్ట‌గ‌ణ‌న ప్ర‌క్రియ కొన‌సాగుతోంద‌ని.. అర్బ‌న్‌, గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌త్యేక బృందాల స‌హాయంతో గృహ‌, వాణిజ్య‌, వ్యాపార న‌ష్టాల‌ను ప్ర‌త్యేక యాప్‌లో న‌మోదు చేయ‌డం జ‌రుగుతోంద‌ని క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు, విజ‌య‌వాడ ఆర్‌డీవో బీహెచ్ భ‌వానీ శంక‌ర్‌, సీపీవో వై.శ్రీల‌త‌, కేఆర్ఆర్‌సీ స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఇ.కిర‌ణ్మ‌యి, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ అద‌న‌పు క‌మిష‌న‌ర్లు డా. ఎ.మ‌హేష్‌, కేవీ స‌త్య‌వ‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement