Wednesday, November 20, 2024

కర్నూలు జిల్లాలో భారీ వర్షం.. పొంగిపొర్లిన వాగులు, వంకలు

కోడుమూరు/అవుకు/గడివేముల, ప్రభన్యూస్‌ : కర్నూలు, నంద్యాల జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల వాగులు, వంకలు పొర్లి రాకపోకలు స్థంభించిపోయాయి. కోడుమూరు నుండి ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయంకు వెళ్లే వాహనాలన్నీ దాదాపు రెండు గంటల పాటు వర్కూరు సమీపంలోని తుమ్మలవాగు వంక వద్ద నిలిచిపోయాయి. పొలాల్లో వర్షపునీరు పొంగి ప్రవహించడంతో చాలాచోట్ల పంటలు కోతకు గురయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

అవుకు మండలం ఎర్రమల కొండలలో కురిసిన భారీ వర్షాలకు దేవ గుండాలు, కాల్వ గడ్డ, నగిలేరు తదితర వాగులు , కునుకుంట్ల చెరువు,ఉప్పలపాడు హయత్‌ ఖాన్‌ చెరువు, సద్దలపాయి చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి.ఈ వర్షం రాకతో రైతులు శనగ, మినుము,పొగాకు,జొన్న వంటి పంటలను సాగు చేసేందుకు ఎంతో వీలుంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కునుకుంట్ల, ఉప్పలపాడు, జూనూతల, మారేమడుగుల తదితర గ్రామాల్లోని రైతులు పొగాకు నాటే పనుల్లో బిజీబిజీగా నిమగ్నమయ్యారు. వంకలన్నీ ఉధృతంగా పొంగి ప్రవహించడంతో ఎత్తిపోత ద్వారా అవుకు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దసరా సెలవులు కావడంతో రిజర్వాయర్‌ బోటింగ్‌ వద్ద పెరుగుతున్న పర్యాటకుల తాకిడి. గడివేముల మండలంలోని బుజునూరు గ్రామానికి చెందిన కౌలు రైతు తూడిచర్ల రాముడు పొలంలో ఆరబెట్టుకున్న దాదాపు 150 క్వింటాళ్ల మొక్కజొన్న పంట తడిచిపోయి కౌలు రైతు తూడిచర్ల రాముడు రూ.లక్ష నష్టపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement