అమరావతి, ఆంధ్రప్రభ: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. నైరుతి బంగ్లాదేశ్ పొరుగు ప్రాంతంలో ఉన్న ఎగువ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, ఉత్తర బంగాళాఖాతం , బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని ఉన్న తీర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో వీళ్ళకొద్దీ నైరుతి వైపుకు వరకు వంగి ఉంది. పశ్చిమ మధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతం మీద ఎగువ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో రాయలసీమ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
రాయలసీమలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని, తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.