ఏపీలో ఇవ్వాల, రేపు భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణశాఖ తెలిపింది. కోస్తా ప్రాంతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తా, రాయలసీమ మీదుగా కర్నాటక వరకు మరో ద్రోణి విస్తరించినట్టు వాతావరణశాఖ పేర్కొంది. దీంతో నైరుతి రుతుపవనాలు మరింత యాక్టివ్ అయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రభావంతో ఇవ్వాల, రేపు ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని సమాచారం.
ఇక.. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనుండగా, మిగిలిన జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రేపు (శనివారం) దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాతావరణంలో అనిశ్చితి నెలకొని ఉందని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్లు, ఆరుబయట ప్రాంతాల్లో ప్రజలు ఉండొద్దని అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమల్లో నిన్న కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.