హైదరాబాద్, ఆంధ్రప్రభ : చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలకు ఆవర్తనాలు తోడవడంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) దేశంలోని పలు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. రాగల ఐదు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిషా, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ముఖ్యంగా ఈనెల 7, 8, 11 తేదీల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 9వ తేదీన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.