Saturday, November 23, 2024

భారీగా నానో యూరియా వినియోగం.. సంప్రదాయ ఎరువు కన్నా రేటు తక్కువ..

అమరావతి, ఆంధ్రప్రభ : భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) నానో టెక్నాలజీతో ఉత్పత్తి చేసిన నానో యూరియాను ఖరీఫ్‌ సీజన్‌లో విస్తృతంగా వినియోగించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేల సారానికీ, పర్యావరణానికి అనుకూలం గా ఉండేలా అనేక పరిశోధనల అనంతరం నానో యూరియాను ఇఫ్కో మార్కెట్లోకి విడుదల చేసింది. నానో యూరియా ఉపయోగాలపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ లో ప్రయోగాత్మకంగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ఉభయగోదావరి జిల్లాల్లో వినియోగించిన నానో యూరియా సత్ఫలితాల నిచ్చింది. దీంతో రబీ సీజన్‌ లో సుమారు లక్ష మంది రైతులు 2.8 లక్షల లీటర్ల నానో యూరియాను బాటిళ్ల రూపంలో కొనుగోలు చేసినట్టు అంచనా. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని జిల్లాల్లో వాడేలా వ్యవసాయశాఖ ప్రణాళిక చేసింది. ఇఫ్కో కేటాయింపుల మేరకు ఖరీఫ్‌ సీజ న్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల బాటిళ్లను వినియోగించనున్నట్టు అంచనా. అనంతపురానికి 1.10 లక్షల బాటిళ్లు కేటాయించగా.. చిత్తూరుకు 1.2, కర్నూలుకు 1.30, నంద్యాలకు 1.30, నెల్లూరుకు లక్ష, కాకినాడ కు 1.10, రాజమండ్రికి 1.10, విజయనగరంకు 1.5, పశ్చిమ గోదావరికి 1.6, కృష్ణాకు 1.5, గుంటూరుకు 1.5, నరసరా వుపేటకు 1.2, ప్రకాశంకు 60 వేల బాటిళ్లను కేటాయించారు.

లిక్విడ్‌ రూపంలో బాటిళ్లలో వచ్చే యూరియా ధర సంప్రదాయ, సాధారణ రకం కన్నా తక్కువగా ఉంది. 500 మిల్లీ లీటర్ల నానో యూరియా బాటిల్‌ 45 కిలోల యూరియా బస్తాతో సమానం. బహిరంగ మార్కెట్లో యూరియా బస్తా ధర రూ 266.50 పైసలుం డగా నానో యూరియా బాటిల్‌ దాని కన్నా రూ 26.50 పైసలు తక్కువగా రూ 240కే లభ్యమవుతోంది. ఖరీఫ్‌ సీజన్‌లో ఏపీ కోసం ఇఫ్కో 500 మీ.లీటర్లతో కూడిన 16 లక్షల బాటిళ్ళు..సుమారు 8 లక్షల లీటర్ల నానో యూరియాను కేటాయించింది. ఖరీఫ్‌ సీజన్‌ కోసం 19.02 లక్షట టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా సబ్సిడీతో రైతులకు పంపిణీ చేసేందుకు సుమారు 7 లక్షల టన్నుల ఎరువుల నిల్వలను ఉంచారు. దీనికి 8 లక్షల టన్నుల నానో యూరియా అదనం. పర్యావరణాన్ని కాపాడేందుకు సంప్రదాయ ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా నానో యూరియాను వినియో గించేందుకు అన్ని రాష్ట్రాల్రు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నానో యూరియా వాడకం ఏపీలో క్రమేపీ పెరుగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement