Tuesday, November 26, 2024

శ్రీశైలానికి భారీగా ఇన్‌ఫ్లో.. నిండుకుండలా జలాశయం

కర్నూలు, (ప్రభ న్యూస్ బ్యూరో) : ఎగువ‌నుంచి వ‌స్తున్న వ‌ర‌ద‌ల‌తో శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. దీంతో శనివారం ఉదయం శ్రీశైలం ఆనకట్ట గేట్లు ఎత్తడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మంత్రి అంబంటి రాంబాబు శుక్రవారం సాయంత్రమే శ్రీశైలం చేరుకున్నారు. కాగా, శుక్ర‌వారం రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌శైలం జ‌లాశ‌యానికి అటు తుంగ‌భ‌ద్ర‌, ఇటు జూరాల నుంచి పెద్ద ఎత్తున వ‌ర‌ద వ‌స్తోంది. ప్ర‌స్తుతం 1,62,726 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతుంది. ఇందులో జూరాల నుంచి 40 వేల క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 71, 172 క్యూసెక్కుల నీరు వ‌స్తోంది. ఇదే సందర్భంలో శ్రీశైలం కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 63 వేల క్యూసెక్కులు దిగువకు రిలీజ్ చేస్తున్నారు. కాగా, ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీశైలం జలాశయం నుంచి వివిధ కాలువలకు అటు తెలంగాణ, ఇటు ఏపీ విడుదల చేశాయి.

తెలంగాణలోని కల్వకుర్తికి 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, ఏపీలోని హంద్రీనీవాకు 1013 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 17 వేల క్యూసెక్కుల చొప్పున 83,266 క్యూసెక్కుల నీళ్లు విడుదల చేస్తున్నారు. అయితే సాయంత్రానికి ఇన్ఫ్లో తగ్గడంతో కాలువలకు నీటి విడుదలను నిలిపివేశారు. శుక్ర‌వారం రాత్రి వ‌ర‌కు శ్రీశైలం డ్యాం 885 అడుగులకు గాను 881.90 అడుగుల నీటి మ‌ట్టం ఉంది. జలాశయంలో 215 టీఎంసీల నీటి నిల్వ‌కు గాను 198. 3623 టీఎంసీలున్నాయి. అంటే జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టంకు మరో 17 టీఎంసీల చేరువలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement