Monday, November 25, 2024

వేడెక్కిన నెల్లూరు రాజకీయం

నెల్లూరు కార్పొరేషన్‌పై మరోసారి వైసీపీ అధిపత్యాన్ని చెలాయించే దిశగా అడుగులు వేస్తోంది. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. దీంతో నామినేషన్ల పరిశీలన ప్రక్రియలోనే నాలుగు డివిజన్ల ను అధికార పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు మరో ఆరు డివిజన్లను సొంతం చేసుకోవాలని అధికార పార్టీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. శనివారం నామినేషన్ల పరిశీలనలో భాగంగా కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది అభ్యర్థుల నామినేషన్ల పై అధికార పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటిని పరిశీలించిన ఎన్నికల అధికారులు నాలుగు డివిజన్లలో తెలుగుదేశం నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో ఆయా స్థానాల నుంచి వైసీపీ నుంచి పోటీలో ఉన్న మంత్రి అనిల్‌ ప్రధాన అనుచరులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. అయితే ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. శనివారం రాత్రి పొద్దుపోయేవరకు అందిన సమాచారం మేరకు 7వ డివిజన్‌ వైసీపీ అభ్యర్థి కిన్నెర మాల్యాద్రి, 40వ డివిజన్‌ నుంచి పోలుబోయిన రూప్‌కుమార్‌ యాదవ్‌లు ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. వీరితో పాటు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో కూడా మరో రెండు డివిజన్ల ను వైసీపీ సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సందర్భంలో 37వ డివిజన్‌కు సంబంధించి టీడీపీ అభ్యర్థి గుడిగుంట్ల వేణుగోపాల్‌ నామినేషన్‌ విషయంలో కూడా వివాదం చెలరేగింది. అదేవిధంగా 10వ డివిజన్‌కు సంబంధించి టీడీపీ అభ్యర్థి తిరుమలనాయుడు నామినేషన్‌ విషయంలో కూడా వివాదం చెలరేగడంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీనిపై టీడీపీ నేతలు ఆందోళనకు కూడా దిగారు. ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. దీంతో నెల్లూరు ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కినట్లయింది.


ఉపసంహరణలోపు.. మరో ఆరు డివిజన్లు సొంతం చేసుకునే వ్యూహం :
నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం చివరిరోజు. ఈలోపే వీలైనన్ని ఎక్కువ డివిజన్ల ను ఏకగ్రీవంగా సొంతం చేసుకోవాలని మంత్రి అనిల్‌ పావులు కదుపుతున్నారు. ఆయనతో పాటు రూరల్‌ శాసనసభ్యులు శ్రీధర్‌రెడ్డి కూడా రంగంలోకి దిగి తమ సత్తా చాటుకునేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రత్యేకించి వైసీపీ అధిష్టానం కూడా ఏకగ్రీవాల విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. దీంతో అధిష్టానం వద్ద తమ మైలేజీని మరింత పెంచుకునేందుకు ఇద్దరు నేతలు రంగంలోకి దిగి ఏకగ్రీవాలపై గురిపెట్టారు. అందుకోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నాలుగు డివిజన్ల ను సొంతం చేసుకున్న అధికార పక్షం.. మరో ఆరు డివిజన్ల పై దృష్టి సారించింది.


అధికార పార్టీ వ్యూహాన్ని.. అంచనా వేయలేకపోయిన టీడీపీ :
నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలో తెలుగుదేశానికి బలమైన నాయకత్వంతో పాటు కేడర్‌ కూడా ఉంది. ప్రత్యేకించి నమ్మకమైన నాయకులు ఆ పార్టీ వెన్నంటే ఉన్నారు. ఇంత అనుకూల వాతావరణం ఉన్నా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అధికార పార్టీ వ్యూహాన్ని అంచనా వేయలేక బోల్తా పడింది. మొదట్నుంచీ మంత్రి అనిల్‌ రంగంలోకి దిగి దగ్గరుండి అన్నీ పర్యవేక్షిస్తూ వచ్చారు. గ్రామీణ నియోజకవర్గంలో కూడా రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్‌రెడ్డిలు బలమైన అభ్యర్థులను బరిలో దించి తెలుగుదేశాన్ని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టేందుకు పావులు కదుపుతూ వస్తున్నారు. అయితే అధికార పార్టీ ఎత్తుగడను ప్రతిపక్షం అంచనా వేయలేకపోయింది. ఆ పార్టీకి చెందిన బలమైన నాయకులు కార్యాలయాలకే పరిమితమయ్యారు. కేవలం సమావేశాలు, చర్చలతోనే సమయం వృధా చేశారే తప్ప.. క్షేత్రస్థాయిలో వైసీపీ వ్యూహాన్ని పసిగట్టలేకపోయారు. ఫలితంగానే నామినేషన్ల పరిశీలన సమయంలోనే నాలుగు బలమైన స్థానాలను టీడీపీ కోల్పోవాల్సి వచ్చింది. ఉపసంహరణ ప్రక్రియ ముగిసేలోపైన సరైన ప్రణాళికలతో ముందుకెళ్లగలిగితే వైసీపీ హవాను కొంతైనా అడ్డుకోగలుగుతుంది. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement