రాజమండ్రి – ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న టిడిపి అధినేత , భర్త చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు సకాలంలో వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన బరువు తగ్గితే అది కిడ్నీలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని, ఈ భయంకరమైన పరిస్థితులు తన భర్త జీవితానికి తక్షణ ముప్పు సృష్టించేలా ఉన్నాయని భువనేశ్వరి ఎక్స్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు.
అత్యవసర వైద్యం అవసరం – నారా బ్రహ్మణి
చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, నారా బ్రాహ్మణి నేడు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘గుండె తరుక్కుపోతోంది. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం తగిన సదుపాయాల్లేని, అపరిశుభ్ర కారాగార పరిస్థితుల మధ్య నిర్బంధంలో ఉన్నారు. అది ఆయన ఆరోగ్యానికి ఆందోళనకర రిస్క్ ను తీసుకొస్తుంది. వైద్య నిపుణులు ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళనలు వ్యక్తం చేసినందున అత్యవసర వైద్య పర్యవేక్షణ అవసరం ఇప్పుడు ఏర్పడింది. సకాలంలో వైద్య సంరక్షణ అందించడం లేదు. ఆయన 5 కిలోల మేర బరువు తగ్గారు. మరింత బరువు తగ్గితే అది కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది. ఆయన ఆందోళన గురించి మేము ఎంతో ఆందోళన చెందుతున్నాం’’ అని బ్రాహ్మణి తన పోస్ట్ లో పేర్కొన్నారు.
చంద్రబాబుకు ఏదైన జరిగితే పూర్తి బాధ్యత జగన్ దే ..
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చంద్రబాబుకు తక్షణం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం అందించాలని కోరారు. ఆయనకు పూర్తిస్థాయిలో వైద్యం చేయడంతోపాటు సరైన వైద్యం అందించాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.