అమరావతి, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ ఆదినుంచి కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షలకు పైగా సభ్యత్వాలు ఉన్న పార్టీగా గుర్తింపు పొందిన తెదేపా కార్యకర్తలకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది. ఇప్పటికే దేశంలోనే తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ కార్యకర్తల సంక్షేమానికి బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనతను తెదేపా సొంతం చేసుకుంది. 2015లో కార్యకర్తలకు బీమా సౌకర్యాన్ని కల్పించింది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇప్పటికే పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. 2015 నుంచి ఇప్పటి వరకు కార్యకర్తల సంక్షేమ నిధికి సమన్వయ కర్తగా లోకేష్ వ్యవహరిస్తున్నారు. టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ ప్రతిఏటా ఒక కొత్త కార్యాచరణను కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ బృందం రూపొందిస్తూ అమలు చేస్తోంది.
2015 నుంచి ఇప్పటి వరకు కార్యకర్తల బీమా పథకాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ దాదాపు 2 వేల మందికి పైగా కార్యకర్తలకు రూ. 100 కోట్ల బీమా మొత్తాన్ని అందజేసి వారి కుటుంబాలను ఆదుకుంది. ప్రమాదవశాత్తు మరణించినా, అంగవైకల్యం చోటుచేసుకున్నా రూ. 5 లక్షల పరిహారం కేవలం పది రోజుల్లో అందేవిధంగా చూస్తూ బాధితుల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. ఇలాంటి తరుణంలో తెదేపా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొనసాగిస్తున్న ప్రమాదబీమా, విద్యాసాయం, పెళ్లి కానుకలకు అదనంగా ఆరోగ్య భరోసా కల్పించాలని నిర్ణయించింది. దీనికోసం నారా లోకేష్ నేతృత్వంలో న్యూట్రిఫుల్ యాప్ను రూపొందిస్తున్నారు. ఈ యాప్ ద్వారా కార్యకర్తలకు అవసరమైన వైద్య సలహాలు, చికిత్సలు అందే విధంగా చర్యలు తీసుకోనున్నారు. మహానాడు వేదికగా ఈ యాప్ను ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..