అమరావతి, ఆంధ్రప్రభ: ఆజాదీకి అమృత్ మహోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో సోమవారం నుంచి ఈనెల 22వ తేదీ వరకు ఆరోగ్య మేళాలు నిర్వహించనున్నట్లు ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ హైమావతి తెలిపారు. మొత్తం 26 జిల్లాలకు గాను 72 డివిజన్లలో ఈ మేళాలు జరుగుతాయన్నారు. ప్రాథమిక వైద్య సేవలతో పాటు దంత, కంటి, నోటి, ప్రసూతి, చిన్న పిల్లలకు వైద్య నిపుణుల ద్వారా ప్రత్యేక వైద్య సేవలు అందించడం జరుగుతోందన్నారు. డయాబిటీస్, హైపర్‌టెన్షన్, క్యాన్సర్ రోగులుకు ఎన్‌సీడీ స్క్రీనింగ్ చేస్తారన్నారు. కుటుంబ నియంత్రణపై, హెల్త్ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు.
రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. హెల్త్ మేళాల నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఏర్పాట్లు చేశారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆమె కోరారు.