Sunday, November 24, 2024

Health: మాటిమాటికీ చ‌లి జ్వ‌రం వ‌స్తోందా.. శ్వాస క‌ష్ట‌మ‌వుతోందా.. సందేహించాల్సిందే..

నిమోనియా… (pneumonia) ఇది ఎన్నో ఏళ్లుగా సమాజాన్ని బాధిస్తున్న వ్యాధి. యాంటీబయోటిక్స్‌ కనిపెట్టక మందు వరకూ అది ఎన్నెన్నో మరణాలకు కారణమైంది. పలు వ్యాధుల కారణంగా ఇన్ఫెక్షన్‌ వచ్చి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉండటం.. ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ఈ వ్యాధిపై చిన్నారుల నుంచి పెద్దవారికి సరైన అవగాహన లేకపోవడంతో సకాలంలో వ్యాధిని గుర్తించలేకపోతున్నారు. వాస్తవానికి శ్వాసక్రియ జరగకుండా మనిషి ఒక్క క్షణం కూడా జీవించి ఉండలేడు. ఈ ప్రక్రియలో ముక్కు నుంచి వెళ్లిన గాలి ఊపిరితిత్తుల్లోకి (Lungs) ప్రవేశిస్తుంది. అది జీవక్రియలకు అవసరమైన ఆక్సిజన్‌ను ఊపిరితిత్తుల చివరి భాగమైన అల్వియైలై అనే గాలి గదిలో మార్పిడి చేసి… జీవక్రియల్లో విడుదలైన హానికర వ్యర్థవాయువులైన కార్బన్‌డయా-కై-్సడ్‌ వంటి వాటిని అక్కడి నుంచి బయటకు తీసుకువస్తుంది.

ఈ కార్యక్రమం నిత్యం జరుగుతూ ఉండటం వల్లనే ప్రాణులు జీవించగలుగుతున్నాయి. గతంలో వచ్చిన నిమోనియాలతో పోలిస్తే 2020, 2021ల్లో వచ్చిన నిమోనియాకు ఎంతో వ్య‌త్యాసం ఉంది. గతేడాది, ఈ ఏడాది కొవిడ్‌ విజృంభించి చాలామంది ప్రాణాలు తీసింది. నిజానికి కరోనా ఆ ప్రాణాలను బలిగొనలేదనీ, కొవిడ్‌ కారణంగా సెకండరీ ఇన్ఫెక్షన్‌గా వచ్చిన నిమోనియా అనేక మంది ఉసురు తీసిందని చెప్పవచ్చు.

విశాఖపట్నం, (ప్రభన్యూస్‌): మనం శ్వాస తీసుకోవడంలో ఎంతో కీలకంగా మారిన ఊపిరితిత్తుల క్షణం ఖాళీ లేకుండా శ్వాసప్రక్రియను జరపుతునే ఉంటాయి. ఊపిరితిత్తుల్లోని అతిచివరి అంచెను ఆల్వియోలై అంటారు. ఈ ఆల్వియోలైలోనే బయట నుంచి ఆక్సిజన్‌ మన శరీర అవయువాలకు అందడం, అక్కడే లోపలి కలుషితమైన గాలి బయటికి రావడం జరుగుతుంది. ఈ ప్రక్రియ జరగడంలో ఏదైనా సమస్య ఏర్పడితే ఆ సమస్యే నిమోనియాకు దారితీస్తుంది. ఇన్ఫెక్షన్ల విషయంలో అన్నింటికంటే ఎక్కువ ప్రాణాలు తీసేది ‘నిమోనియా’.

నిమోనియాని పూర్తిగా నయం చేసేలా క‌చ్చితమైన చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ ఇన్ని మరణాలు నమోదవుతున్నాయి అంటే దాని తీవ్రత ఏంటో తెలుసుకోవ‌చ్చు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), యూనిసెఫ్‌ తమదైన ఓ లక్ష్యంతో ఒక కార్యచరణ ప్రణాళిక రూపొందించాయి. ప్రతి దేశంలోనూ 2025 నాటికి నిమోనియా మరణాల సంఖ్యను ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో కేవలం ముగ్గురికి తగ్గించాలన్నదే ఆ గ్లోబల్‌ యాక్షన్‌ ప్లాన్‌ లక్ష్యం.

వ్యాధి నిర్ధారణ ఇలా…
రోగి చెప్పిన లక్షణాలను బట్టి, రోగిని పరీక్షించడం ద్వారా నిమోనియా నిర్ధారణ చేయవచ్చు. దాంతోపాటు ఎక్స్‌రే, కళ్లె (స్పుటం) పరీక్ష, కొన్ని సందర్భాల్లో యూరిన్‌ యాంటిజెన్‌ పరీక్ష, రక్త పరీక్ష వంటివి వ్యాధి నిర్ధారణకు తొడ్పడతాయి. ఇక రక్తంలో ఆక్సిజన్‌ పాళ్లను పరీక్షిస్తూండాలి. ఎందుకంటే ఒక్కోసారి నిమోనియాతో రక్తంలోని ఆక్సిజన్‌ పాళ్లు తగ్గే అవకాశం ఉంది. తీవ్రమైన నిమోనియాతో హాస్పిట‌ల్‌లో చేరిన రోగులకు యాంటీబయాటిక్‌ చికిత్స అందిస్తున్నా మెరుగుదల కనిపించే సందర్భాల్లోనూ.. చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి నిలకడగా లేక దిగజారుతుంటుంది. అప్పుడు బ్రాంకీస్కొపీ పరీక్ష చేస్తుంటారు. రోగిలో కనిపించే లక్షణాలతో సీబీపీ, సీఎక్స్‌ఆర్‌ వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. ఒక్కోసారి వ్యాధి తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి ఛాతీ సీటీ- స్కాన్‌, కళ్లె గల్ల తెమడ పరీక్ష వంటి పరీక్షలూ అవసరం కావచ్చు.

- Advertisement -

లక్షణాలు ఇవే..
నిమోనియా సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా తరుచూ జ్వరం చలిగా అనిపించడం, ఊపిరి సరిగా అందకపోవడం, శ్వాస తీసుకునే సమయంలో ఒక్కోసారి నొప్పి చాలా వేగంగా శ్వాస తీసుకోవడం, గుండె వేగం పెరగడం, వికారం, వాంతులు, దగ్గుతున్నప్పుడు ఆకుపచ్చ లేదా పసుపు రంగులో కళ్లె పడటం, కొన్ని సందర్భాల్లో తుప్పు రంగులో కనిపించడం, అయోమయానికి గురికావడం, ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

నివారణ ఇదే…
పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, పెర్టుసస్‌లతో పాటు నిమోకోకల్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్ల చిన్నారుల్లో దీన్ని నివారించవచ్చు. పొగతాగే అలవాటును తక్షణం మానేయాలి. ఆల్కహాల్‌ కూడా.. పొగ వాతావరణానికి ఎక్స్‌పోజ్‌ కాకుండా చూసుకోవాలి. ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్‌ ఉన్నవారు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు అంత త్వరగా రావు. పోషకాలన్నీ ఉండేలా సమతులాహారం తీసుకోవాలి. దాంతో రోగనిరోధకశక్తి పెరుగుతంది. అది నిమోనియాతో పాటు- అనేక రకాల ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షిస్తుంది.

నిమోనియాకు తక్షణం చికిత్స అవసరం… లేదంటే… అనేక కారణాల్లో దేనివల్ల నిమోనియా వచ్చినప్పటికీ చికిత్స తీసుకోకపోతే బాధితుడి పరిస్థితి సంక్లిష్టంగా మారుతుంది. ఫలితంగా ఇతర కాంప్లికేషన్లు వస్తాయి. ఉదాహరణకు… మూత్రపిండాలు దెబ్బతినడం, పక్షవాతం, సెప్టిసీమియా (అంటే రక్తానికి ఇన్ఫెక్షన్‌ సోకి, అది విషపూరితంగా మారడం), రక్తపోటు పడిపోవడం, మెదడుపై దుష్ప్రభావం వంటి కాంప్లికేషన్లు రావచ్చు. ఒక్కోసారి మరణం సంభవించడం కూడా నిమోనియా కేసుల్లో తరచూ కనిపిస్తుంటుంది. అన్ని వయసుల వారిలోనూ, చిన్న పిల్లలు మొదలుకొని, వృద్ధుల వరకు నిమోనియా ఏ వయసు వారిలోనైనా రావచ్చు. చిన్నారులూ, వృద్ధుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువ కాబట్టి వారిలో ఇది కనిపించడం చాలా సాధారణం.

సకాలంలో వైద్యసేవలు పొందాలి : డాక్టర్‌ ఎస్‌ఎన్‌ఆర్‌ నవీన్‌, ఫల్మనాలజిస్ట్‌, కేజీహెచ్‌
అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి వృద్ధాప్యంలో ఉన్నవారికి సైతం నిమోనియా వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది. చిన్నపాటి లక్షణాలు కనిపించిన వెంటనే తక్షణమే వైద్యసేవలు పొందాలి.ముఖ్యంగా ఆల్కాహాల్‌,పొగ తాగడం మానేయాలి. అదే విధంగా పరిశ్రమలు, ఇతర కంపెనీల నుంచి విడుదలయ్యే రసాయనాలకు అధికంగా పీల్చకూడదు.నిమోనియాకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిమోకోకల్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement