Wednesday, November 27, 2024

Health – గుండెపోటుకు బ్రేకులు! క్యాప్సుల్ రెడీ బాప‌ట్ల అధ్యాప‌క బృందం

ఏపీలో కొత్త మెడిసిన్‌ ఫార్ములా రెడీ
కుందేళ్ల‌పై చేప‌ట్టిన‌ ప్ర‌యోగాలు స‌క్సెస్‌
ప‌రిశోధ‌నలు చేసిన బాప‌ట్ల అధ్యాప‌క బృందం
ఆచార్య సాయికిషోర్ నేతృత్వంలో ప‌రిశోధ‌న‌
ఎలాంటి ముప్పు లేకుండా హార్ట్ స్ట్రోక్స్‌కి అడ్డుక‌ట్ట‌
అంత‌ర్జాతీయ జ‌ర్న‌ల్‌లో అధ్య‌య‌నం వివ‌రాల ప్ర‌చుర‌ణ‌
ఔష‌ధానికి పేటెంట్ జారీ చేసిన కేంద్ర పేటెంట్ సంస్థ‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌:

ఆధునిక కాలం.. ఉరుకులు, ప‌రుగుల జీవితం.. మారుతున్న ఆహారపుటలవాట్లు ప్రజల ఆయుష్షును తగ్గిస్తున్నాయి. ఇదే మానవ జీవనశైలి ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తోంది. కొవిడ్ తర్వాత జీవనశైలి మార్చుకుని చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. ఇందులో భాగంగానే డైట్, వ్యాయామం చేస్తున్నారు. అయితే.. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ మధ్య గుండెపోటు వంటివి అంద‌రినీ కలవరప‌రుస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ ప‌ర్స‌న్స్ వ‌ర‌కు చాలా మంది గుండెపోటుతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. కాగా, గుండెపోటు వస్తున్న తీరును గమనిస్తే చాలా మందిలో వేకువజామునో, తెల్ల‌వారుజామునో ఎక్కువగా హార్ట్ ఎటాక్ వ‌స్తుండ‌డాన్ని ప‌రిశోధ‌కులు గ‌మ‌నించారు. దీన్ని నిరోధించేందుకు కొత్త ఔషధ ఫార్ములాను ఏపీకి చెందిన బాప‌ట్ల ఫార్మ‌సీ కాలేజీ అధ్యాప‌క బృందం క‌నిపెట్టింది. పేటెంట్ హ‌క్కుల‌ను పొందింది.

గుండెపోటు వ‌చ్చే స‌మ‌యం అదేనా?
హార్ట్ ఎటాక్​ను నిరోధించే కొత్త ఔషధ ఫార్ములాను బాపట్ల ఫార్మసీ కళాశాల ఆచార్యుడు వి.సాయికిషోర్‌ నేతృత్వంలో పరిశోధక విద్యార్థులు టి.వాణీ ప్రసన్న, బి.వంశీకృష్ణ అభివృద్ధి చేశారు. వీరి ఫార్ములాకు పేటెంట్‌ లభించింది. గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామున వస్తోంది. దాని కారకాలు వేకుమజామున విడుదల కావడమే అందుకు కారణం. అర్ధరాత్రి, వేకువజామున గుండెపోటు వస్తే ఆ సమయంలో బాధితులు వెంటనే మాత్రలు వేసుకోలేకపోతున్నారు.

నాలుగున్న‌ర ఏండ్లుగా ప‌రిశోధ‌న‌లు..
ఈ ప్రతికూలతలను అధిగమించి, కారకాలను నిరోధించేలా ఔషధాలు రూపొందించడంపై ఆచార్యుడు సాయికిషోర్, పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ, వాణీప్రసన్న పరిశోధనలు చేశారు. ఇందుకోసం నాలుగున్నరేళ్లకు పైగా శ్రమించారు. గుండెపోటు కారకాలను నిరోధించే ప్రతినిరోధకాలను శరీరంలో తగిన సమయంలో విడుదల చేయడం ద్వారా ముప్పు లేకుండా చూడవచ్చని తెలుసుకున్నారు. రాత్రి భోజనం తర్వాత 9గంటలకు ఈ కాప్స్యూల్‌ వేసుకుంటే అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రతి నిరోధకాలను విడుదల చేసి హార్ట్ ఎటాక్​ను సమర్థంగా అడ్డుకుంటుందని పరిశోధనల ద్వారా నిరూపించారు.

- Advertisement -

అంత‌ర్జాతీయ రీసెర్చ్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చుర‌ణ‌..

ఈ ఔషధాన్ని రెండు దశల్లో కుందేళ్లపై పరీక్షించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి పరిశోధనా గ్రంథం సమర్పించారు. ఈ పరిశోధన పత్రం అంతర్జాతీయ రీసెర్చ్‌ జర్నల్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీలో ప్రచురితమైంది. తమ ఔషధ ఫార్ములాపై పేటెంట్‌ హక్కు కోసం ఈ సంవత్సరం మేలో దరఖాస్తు చేసినట్లు ఆచార్యుడు సాయికిశోర్ తెలిపారు. తాజాగా కేంద్ర పేటెంట్‌ సంస్థ పేటెంట్‌ జారీ చేసిందని పేర్కొన్నారు. పేటెంట్‌ పొందిన బృందానికి బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు, కార్యదర్శి మానం నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్‌ టీఈ గోపాలకృష్ణమూర్తి అభినందనలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement