హైదరాబాద్, ఆంధ్రప్రభ : ”మితంగా తింటే అమృతం.. అతిగా తింటే విషమని పెద్దలు చెప్పేమాట. జిమ్, ఇతర ఫిట్‌నెట్ వర్కవుట్ల విషయంలోనూ ఈ నానుడి వర్తిస్తుంది.” అని యువతకు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శరీరానికి వ్యాయామం ఎంతో అవసరమని, కాని అది మితిమీరితే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో చనిపోవడంతో జిమ్‌లో గంటలతరబడి వర్కవుట్లను తగ్గించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఇటీవల సిక్స్ ప్యాక్ బాడీ కోసం శారీరకంగా ఫిట్‌గా ఉన్న గంటల తరబడి వ్యాయామం చేయడం కామన్ అయిపోయింది. అయితే కండలతో కనబడుతున్నంత మాత్రాన పూర్తి ఆరోగ్యానికి అది సూచిక కాదని వైద్యులు తేల్చి చెబుతున్నారు. స్లిమ్‌గా కనపడాలనో, రాత్రికి రాత్రే బరువు తగ్గాలనో, సిక్స్ ప్యాక్ కండలు తిరిగిన దేహం కోసమో , కొద్దిరోజుల్లోనే బాడీ ఫిట్‌నెస్ సాధించాలనో మితిమీరి వర్కవుట్లు చేస్తే ప్రాణాలకే ప్రమాదమని యువతను వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వర్కువుట్ చేస్తున్నపుడు నిస్సత్తువ ఆవరించినా, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా, తలతిరిగినా వెంటనే విరామం తీసుకోవాలని, లేనిపక్షంలో 100శాతం ఏదో ఒకటి జరిగే ప్రమాదముందని స్పష్టం చేస్తున్నారు. వెంటనే స్వచ్ఛమైన గాలి అందే ప్రదేశానికి వెళ్లాలంటున్నారు.
అదేపనిగా వర్కవుట్లతో గుండెపోటు…
అదేపనిగా గంటల తరబడి జిమ్‌లో, ఇతర చోట్ల వ్యాయామాలు చేస్తే గుండె కొట్టుకునే తీరు దెబ్బతింటుంది. ఈ పరిణామంతో సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. జిమ్‌లో శక్తికి మించి బరువులు ఎత్తినా, వ్యాయామం చేసినా ఆ ఒత్తిడి గుండె, ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరాచేసే నాళాలపై పడి అవి చిట్లిపోయే ప్రమా దముంది. సాధారణ ంగా రోజూ 30 నిమిషాలపాటు ఓ మోస్తారు వర్కవు ట్లు చేస్తే చాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరీ అలిసిపోయేం త వరకు వర్కవుట్లు చేస్తే అది గుండె సంబంధిత రోగాలకు, గుండెపోటు కు దారితీసే ప్రమాదముంది. వారంలో 150 నిమిషాలపాటు వ్యాయామం చేస్తే చాలంటున్నారు.
30ఏళ్లలోనే బీపీ, షుగర్, గుండెపోటు.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న యువత
యువతపై జీవనశైలి వ్యాధులు విసురుతున్నాయి. త్వరగా సంపాదించాలనో, వృత్తిలో టార్గెట్లను అధిగమించా లన్న ఆతృతలో యువత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతోంది. ఫలితంగా 30ఏళ్ల వయసులోనే బీపీ, షుగర్, గుండె జబ్బులు తదితర జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నారు. నడివయసు అంటే.. 30వపడిలోనే బీపీ, షుగర్, 40ఏళ్ల ప్రాయంలోనే గుండెపోటుతో ప్రాణాలు వదులుతున్నారు. ఇటీవలి కాలంలో నడి వయసు మరణాలు పెరిగిపోతుండ డంతో ఆందోళనకు గురిచేస్తోంది. పొగాకు వాడకం, మద్యపానం సేవించడం గుండె జబ్బులతో యువత మరణించేందుకు ప్రధాన కారణమవుతోంది. 30-44 ఏళ్ల వయసు వారిలో 26 శాతం మంది గుండె జబ్బులతో బాధపడుతున్నట్లు వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమి, ఒత్తిడి గుండె పనితీరును మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయి.