చంద్రబాబు తనను బచ్చా అంటున్నారని, తాను బచ్చానైతే… డజను మందిని పోగేసుకుని వస్తున్న ఆయనను ఏమనాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. అనకాపల్లి మేమంతా సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ… తమ సభలకు వస్తున్న స్పందన చూసి కూటమి నేతలు ఓర్వలేకపోతున్నారని.. వైసీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తనను బచ్చా అన్న చంద్రబాబు వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబును చూస్తుంటే కృష్ణుడిని బచ్చా అన్న కంసుడు గుర్తుకు వస్తున్నాడని సెటైర్లు వేశారు.. తనను బచ్చా అన్న వ్యక్తి పది మందిని వెంటవేసుకు వస్తున్నాడని ఎద్దేవా చేశారు.
బాణాలు, రాళ్లు, ఆయుధాలు పట్టుకుని నన్ను చుట్టుముట్టారని వ్యాఖ్యానించారు. కానీ తాను మాత్రం ఒంటరిగా పోటీ చేస్తున్నానని కౌంటర్ ఇచ్చారు. ఎక్కడిని ఎదుర్కోవడానికి నక్కలన్నీ ఒక్కటయ్యాయని విమర్శించారు. తాను బచ్చా అయితే తన చేతిలో ఓడిపోయిన తమర్ని ఏమనాలని సీఎం జగన్ ప్రశ్నించారు. ఈ బచ్చా చేసిన పనులు తమరెందుకు చేయలేకపోయారని సీఎం జగన్ నిలదీశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షే పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. ఎలాంటి వివక్షకు తావు లేకుండా ప్రతి కుటుంబానికి పథకాలు అందజేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. స్వయం ఉపాధి, రైతు భరోసా అందజేశామని గుర్తు చేశారు. తాము అందించిన సంక్షేమ పథకాలు గతంలో అమలయ్యాయా అని సీఎం జగన్ ప్రశ్నించారు.
విలన్లకు హీరోలు బచ్చాల్లాగే కనిపిస్తారని సీఎం జగన్ అన్నారు. మూడు వారాల్లో జరగబోతున్న ఈ ఎన్నికలు.. ఇంటింటి చరిత్రను నిర్ణయించే ఎన్నికలుగా ఎప్పటికీ గుర్తుండిపోతాయి.. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలే కాదు.. ఇవి మన పేదలను, ఇవి మన రైతులను, ఇవి పిల్లలను, ఇవి అక్క చెల్లెమ్మలను, ఇవి మన అవ్వాతాతలను, ఇవి పేద సామాజిక వర్గాలను నిర్ణయించే ఎన్నికలన్నారు. ఈ ఎన్నికలు మంచి చేసిన ప్రజల మనసు గెలిచి మనం.. కుట్రలతో మోసాలతో వారు తలపడుతున్న ఈ ఎన్నికలకు మీరంతా సిద్ధమేనా ? అన్ని అడగగా తాము సిద్ధం మీ వెంటే మేము అంటూ నినాదాలు చేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ మాట్లాడుతూ.. ఇచ్చిన ప్రతీ హామీని సీఎం జగన్ నెరవేర్చారు. సీఎం జగన్ ప్రతి ఇంటికి సంక్షేమం అందించారు. అందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.