Monday, November 18, 2024

అక్ర‌మ నిర్మాణాలు కూల్చాల్సిందే – హైకోర్టు

అమరావతి, ఆంధ్రప్రభ: అక్రమ నిర్మాణాల ను కూల్చాల్సిందే అని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి రాజీ ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది.. కూల్చివేతలకు అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులకు స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అయ్యే ఖర్చును సంబంధిత భవన యజమానులే భరించాలని ఆదేశాలను అమలుచేసి నివేదికను సమర్పించా ల్సిందిగా పురపాలకశాఖను, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ విజయవాడ నగరంలో ఓ భవనం మూడో అంతస్తుతో పాటు నీళ్ల ట్యాంక్‌ నిర్మాణం చేపట్టటాన్ని తీవ్రంగా పరిగణించింది. భవనానికి నష్టం వాటిల్లకుండా వాటిని కూల్చివేయాలని అధికారులను ఆదేశించింది. నగరంలోని ఇస్లాంపేట, సయ్యద్‌ గులాబ్‌ రోడ్డులో తమ భవన నిర్మాణాన్ని కూల్చేందుకు మునిసిపల్‌ అధికారులు జారీచేసిన నోటీసులను రద్దుచేయాలని కోరుతూ ఇరువురు యజమానులు 2020లో పిటిషన్‌ దాఖలు చేశారు.


విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం యథాతథ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతలు వద్దని అధికారులకు సూచించింది. అయితే పిటిషనర్లు ఆదేశాలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు జరుపుతున్నారని వీఎంసీ తరపు న్యాయవాది మలసాని మనోహరరెడ్డి కోర్టుకు నివేదించారు. నిజ నిర్థారణ నిమిత్తం న్యాయవాది సుబోధ్‌ను అడ్వొకేట్‌ కమిషన్‌గా కోర్టు నియమించింది. భవనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన సుబోధ్‌ అక్రమ నిర్మాణాలపై కోర్టుకు నివేదిక సమర్పించారు. ఇందులో ఇంప్లీడ్‌ అయిన పిటిషనర్లు కూడా కూడా అక్రమ నిర్మాణాలు జరిగాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో మరో న్యాయవాది కుంచెం మహేశ్వరరావును అడ్వొకేట్‌ కమిషన్‌గా కోర్టు నియమించింది.
భవనంలో అదనంగా మూడో అంతస్తుతో పాటు వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం జరిపారని ఆయన కూడా నివేదిక సమర్పించారు. ఈ నివేదికలను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి రవినాథ తిల్హరీ కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆ తరువాత అధికారులు ఇచ్చిన నోటీసుపై విచారణ జరుపుతామని ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు. ఉత్తర్వుల అమలుకు అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని పురపాలక అధికారులకు సహకరించాలని విజయవాడ సిటీ పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక సమర్పించాలని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement